‘సింహాచలం’ భూములు పంచిపెట్టడం కుదరదు

13 Mar, 2019 07:42 IST|Sakshi

పంచగ్రామాల భూసమస్య పరిష్కార జీవోలో నిజాయితీ లేదు

జీవోలు చట్టాల ప్రకారం, చట్టాలు రాజ్యాంగం ప్రకారం ఉండాలి

జీవో విషయం పత్రికల్లో చూసి.. సీఎంకు, మంత్రికి ఉత్తరం రాశా

రామకృష్ణుడు మాట్లాడతారని చెప్పారు..కానీ మాట్లాడలేదు

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని భక్తులే రక్షించుకుంటారు

సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త,  కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు

సింహాచలం:  శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన పంచగ్రామాల భూసమస్య పరిష్కారం చేస్తామంటూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఫెయిర్‌నెస్‌ (నిజాయితీ) లేదని స్వయానా ఆ దేవస్థానం అనువంశిక ధర్మకర్త, కేంద్ర  మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ పూసపాటి అశోక్‌గజపతిరాజు విమర్శించారు. సింహాచలం దేవస్థానానికి చెందిన శ్రీకృష్ణాపురంలోని గోశాలలో జరుగుతున్న సుదర్శన నారసింహ మహాయజ్ఞంలో పాల్గొనేందుకు మంగళవారం వచ్చిన ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. క్రమబద్ధీకరణకు ఎప్పుడో 20 ఏళ్ల కిందటి భూమి విలువలో 7.5శాతం కట్టాలని జీవోలో పేర్కొనడం మరీ హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో 70శాతం మార్కెట్‌  విలువ ప్రకారం క్రమబద్ధీకరించుకోవాలని  జీవో రాగా.. ఆ ప్రకారం కొంతమంది దేవస్థానానికి నగదు చెల్లించి క్రమబద్ధీకరించుకున్నారని, ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అంటే అప్పుడు వాళ్లు కట్టిన నగదు వడ్డీతో సహా ఇవ్వాలా.. వద్దా మీడియానే చెప్పాలన్నారు. జీవోలు చట్టాల ప్రకారం జరగాలని, చట్టాలు రాజ్యాంగం ప్రకారం ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎస్టేట్‌ ఆఫ్‌ ఆల్‌ ఇష్యూ అనే యాక్ట్‌ ఉందని, అన్నీ ఎస్టేట్స్‌ అయ్యాయని తెలిపారు.

మన దేశంలో చాలా హిందూ ఆలయాలు, హిందూ యేతర ఆలయాలున్నాయన్నారు. తాము వివిధ ప్రాంతాల్లోని 104 ఆలయాలకు అనువంశిక ధర్మకర్తలుగా ఉన్నామని, వాటిల్లోనూ ఇదే రీతిలో సమస్యలున్నాయని తెలిపారు. ఇలాంటి జీవోలు తీసుకొస్తే వాటిని కూడా పూర్తిగా మూసివేయాల్సి ఉంటుందని చెప్పారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానానికి చెందిన పంచగ్రామాల భూసమస్య జీవో నిర్ణయంపై అధికారులు ఏం మాట్లాడారో తనకు తెలియదన్నారు. తానైతే పేపర్లలో చూసి ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కె.ఇ. కృష్ణమూర్తికి లేఖ రాశానన్నారు. సీఎంని కలిసి జీవోలో నిజాయితీ ఉండాలని కోరగా ఆయన రామకృష్ణుడు మీతో మాట్లాడతారని సమాధానం ఇచ్చారన్నారు. కానీ ఇప్పటి వరకు రామకృష్ణుడు తనతో మాట్లాడలేదన్నారు. ఇలాంటి  పరిస్థితే కొనసాగితే దేశంలో ఏ మతం, ఏ చారిటబుల్‌ ట్రస్టు కూడా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.

జీవోలో మీ రిప్రజెంటేషన్‌ కూడా కోడ్‌ చేశారన్న విషయంపై విలేకర్లు ప్రస్తావించగా.. ‘నేనిచ్చిన రిప్రజెంటేషన్‌ ఎక్కడా కోడ్‌ చేయలేదు. కావాలంటే ఆ కాపీలు మీకిస్తాను చదవండని’ పూసపాటి అన్నారు. వరాహ లక్ష్మీనృసింహస్వామి ఇక్కడ ఉండకూడదనే ఆలోచనతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ జీవో ప్రకారం క్రమబద్ధీకరణ జరిపితే ఆ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారినిæ భక్తులే రక్షించుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. 20 ఏళ్ల కిందట విలువలో 7.5శాతం ఎందుకని..ఉచితంగా ఇస్తే అయిపోయేది కదా అని అసహనం వ్యక్తం చేశారు. కాగా, ప్రజలంతా జీవోలో పేర్కొన్న విధంగా కాకుండా మరింత ఎక్కువ కట్టడానికి సిద్ధంగా ఉన్నారని మీడియా ప్రస్తావించగా.. తామేమీ చిల్లర కొట్టు పెట్టలేదని, బేరాలు ఆడుకోవడం లేదని అశోక్‌గజపతిరాజు ఘాటుగా సమాధానం ఇచ్చారు.

మరిన్ని వార్తలు