మాయావతి మాజీ కార్యదర్శికి ఐటీ షాక్‌

25 Sep, 2019 08:27 IST|Sakshi
బీఎస్‌పీ అధినేత మాయావతి, మాజీ కార్యదర్శి నేత్‌రామ్‌(ఫైల్‌ ఫోటో)

మాయావతి మాజీ కార్యదర్శి నేత్‌రామ్‌పై ఐటీ శాఖ కీలక నిర్ణయం

రూ.230 కోట్ల విలువైన  బినామీ ఆస్తులు ఎటాచ్‌ 

సాక్షి, ముంబై: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మయావతికి మాజీ కార్యదర్శి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి నేత్‌రామ్‌కు ఐటీ విభాగం షాకిచ్చింది. అక్రమ ఆస్తులకు సంబంధించి ఆదాయ పన్నుఅధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నోయిడా, కోల్‌కతా, ముంబైతోపాటు మొత్తం 19 స్థిరాస్తులను ఆదాయపు పన్ను శాఖ ఎటాచ్‌ చేసింది. నేత్రకు చెందిన మొత్తం 230 కోట్ల రూపాయల విలువైన 'బినామి' ఆస్తులను ఎటాచ్‌ చేసినట్టుగా అధికారిక వర్గాలు మంగళవారం తెలిపాయి.

1988 బినామీ ఆస్తి లావాదేవీల నిషేధ చట్టం సెక్షన్ 24 (3) కింద, వివిధ వాణిజ్య, నివాస ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. జప్తుచేసిన వాటిలో వాణిజ్య, నివాస సముదాయాలుతోపాటు రూ.1.64 కోట్ల నగదు, రూ.50 లక్షల విలువైన ‘మాంట్‌ బ్లాంక్‌' కలాలు, నాలుగు విలాసవంతమైన ఎస్‌యూవీ కార్లు ఉన్నాయి. బీఎస్‌పీ అధినేత మాయావతి ముఖ్యమంత్రి పదవిలో ఉండగా వివిధ ఉన్నత పదవుల్లో పనిచేసిన నేత్‌రామ్‌ నివాసం, కార్యాలయాలపై ఈ ఏడాది మార్చిలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి రూ.300 కోట్ల విలువైన బినామీ ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.  యూపీలో బీఎస్పీ పాలనలో షుగర్ మిల్లుల పెట్టుబడుల కుంభకోణం కేసులో అవినీతి ఆరోపణలకు సంబంధించి సీబీఐ కూడా ఆయనను విచారిస్తోంది. కాగా ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఏడు సంవత్సరాల వరకు కఠినమైన జైలు శిక్ష,  బినామీ ఆస్తి మార్కెట్ విలువలో 25 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు