ఇది రాహుల్‌ గాంధీకే నష్టం !

26 Jun, 2018 15:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌ సంకీర్ణ ప్రభుత్వం నుంచి గత మంగళవారం బీజేపీ తప్పుకోవడంతో మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని ప్రభుత్వం రాజీనామా చేయడం, రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధించడం తదితర పరిణామాలు తెల్సినవే. ఈ పరిణామాలపై ఎలా స్పందించాలి, ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోవాలి? అన్న అంశంపై రాహుల్‌గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ సంశయంలో పడింది. గత బుధవారం మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని తొమ్మిదిమంది సభ్యులు గల కశ్మీర్‌ కమిటీ ఆదరాబాదరాగా సమావేశమై ఏవో ఆపద్ధర్మ నిర్ణయాలు తీసుకుంది.

గతేడాది కశ్మీర్‌లో హింసాకాండ పెరగడంతో అందుకు కారణమవుతున్న అంశాలను క్షుణ్నంగా పరిశీలించి పార్టీ అనుసరించాల్సిన విధాన నిర్ణయాలను ఖరారు చేయడం కోసం పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మన్మోహన్‌ సింగ్‌తోపాటు పార్టీ సీనియర్‌ నాయకులు కరణ్‌ సింగ్, పీ. చిదంబరం, గులామ్‌ నబీ ఆజాద్, గులామ్‌ అహ్మద్‌ మీర్, అంబికా సోని, రిగ్జిరిన్‌ జోరా, తారిక్‌ అహ్మద్, శ్యామ్‌లాల్‌ శర్మలు ఉన్నారు. గత బుధవారం వారంత అందుబాటులో లేకపోవడంతో ఉన్నవారితోనే మన్మోహన్‌ సింగ్‌ సంప్రదింపులు జరిపారు.

ఒకవేళ ఈ కమిటీయే లేకపోతే కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసేది? అన్నది ప్రశ్న. అత్యున్నత స్థాయిలో పార్టీ విధాన నిర్ణయాలు తీసుకునే ‘కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ’ ఉనికిలో లేకపోవడమే ఈ ప్రశ్నకు కారణం. రాహుల్‌ గాంధీ తన నాయకత్వంలో తనకు విశ్వాసపాత్రులు, సమర్థులని నమ్మే నాయకులను ఎన్నుకోవడం కోసం సోనియా గాంధీ గత మార్చి నెలలోనే తన నాయకత్వంలో ఉన్న పార్టీ వర్కింగ్‌ కమిటీని రద్దు చేసింది. అనంతరం జరిగిన ప్లీనరీ కూడా సీడబ్ల్యూసీని ఏర్పాటు చేసేందుకు రాహుల్‌ గాంధీకి పూర్తి స్వేచ్ఛను కల్పించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు నెలలు గడుస్తున్నా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఎలాంటి చొరవ తీసుకోలేదు.

సీడబ్ల్యూసీ ఉనికిలో లేకపోవడం వల్ల కీలకమైన అంశాల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడల్లా రాహుల్‌ గాంధీ తన రాజకీయ సలహాదారులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి పార్టీ సీనియర్‌ నాయకులు రాహుల్‌పై మండిపడుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ లేకపోవడం వల్ల ఆ ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికైనా పటిష్టమైన సీడబ్ల్యూసీ లేకపోతే పార్టీ నష్టపోవాల్సి వస్తోంది. సీడబ్ల్యూసీ ఉన్నట్లయితే పార్టీ సీనియర్‌ నేతలు సమావేశమై నిర్ణయం తీసుకుంటారు. లేకపోయినట్లయితే వారు తమ  వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా చెబుతుంటారు. దానివల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుంది.

మరిన్ని వార్తలు