ఆ డబ్బు ఎక్కడిది?

4 Oct, 2018 00:54 IST|Sakshi
బుధవారం ఆయ్‌కార్‌భవన్‌కు విచారణ నిమిత్తం వస్తున్న రేవంత్‌రెడ్డి, ఉదయసింహారెడ్డి

     ‘ఓటుకు కోట్లు’లో రేవంత్, ఉదయ్‌సింహాపై ప్రశ్నల వర్షం 

     ఐదున్నర గంటల పాటు విచారించిన ఐటీ అధికారులు 

     ఐటీ అధికారుల ముసుగులో కేసీఆర్‌ సైన్యం విచారణ 

     డీఐజీ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ రాధాకిషన్‌రావుల వేధింపులు 

     ధైర్యంగా అన్నింటిని ఎదుర్కొంటానని రేవంత్‌రెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. వారం రోజుల క్రితం ఆయన ఇంట్లో సోదాలు చేసిన అధికారులు ఇచ్చిన నోటీసు మేరకు రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం 11.30 గంటలకు ఆయ్‌కార్‌ భవన్‌లో విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు తీసుకెళ్లిన రూ.50 లక్షల నగదును ఎవరు ఇచ్చారు? ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశాలపైనే ప్రధానంగా అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంత మొత్తాన్ని ఎవరి ఖాతా నుంచి డ్రా చేశారు, ఆ డబ్బును సంబంధిత వ్యక్తి ఆదాయపు పన్ను కింద చూపించారా లేదా అన్న అంశాల్లో క్లారిటీ ఇవ్వాలని రేవంత్‌ను అడిగినట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు రాసిన లేఖపైనే తాము విచారణ జరుపుతున్నామని, రూ.50 లక్షలతో పాటు మిగతా రూ.4.5 కోట్ల సంగతి కూడా చెప్పాలని పదే పదే ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే డొల్ల కంపెనీలకు సంబంధించిన అంశాలపై రేవంత్‌ వివరణ ఇచ్చినట్లు ఐటీ వర్గాల ద్వారా తెలిసింది. తనకెలాంటి కంపెనీలు లేవని, తాను దాఖలు చేసిన అఫిడవిట్‌తో పాటు ఐటీ రిటర్నులపై ఆడిటర్‌తో కలసి ఐటీ అధికారులకు రేవంత్‌ వివరించారని సమాచారం.
 
మీ ఖాతాలోవేనా..? 
స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు తీసుకెళ్లిన రూ.50 లక్షల నగదు ఎక్కడి నుంచి వచ్చిందని రేవంత్‌తో పాటు ఉదయ్‌సింహాను ఎదురెదురుగా కూర్చోబెట్టి ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏసీబీ నుంచి ఒక డీఎస్పీ, మరో ఇన్‌స్పెక్టర్‌ ర్యాంక్‌ అధికారి కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. ఆ డబ్బు మీ ఖాతా నుంచి డబ్బు డ్రా చేస్తే దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలని కోరినట్లు తెలిసింది. ఒకవేళ ఉదయ్‌సింహా ద్వారానే వస్తే ఆ డబ్బు ఎవరిచ్చారో చెప్పాలని అతన్ని ప్రశ్నించినట్లు ఐటీ అధికార వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని రేవంత్, ఉదయ్‌సింహా కోరినట్లు తెలిసింది. దీంతో ఓటుకు కోట్లు విచారణ ఆపి మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.15 గంటల వరకు భోజన విరామం ఇచ్చారు. 2.15 గంటల తర్వాత తన పాత ఇంట్లో ఉన్న కంపెనీలకు రేవంత్‌కు సంబంధం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. తన పేరిట ఎలాంటి కంపెనీలు లేవని, అవసరమైతే రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని రేవంత్‌ దీటుగానే బదులిచ్చినట్లు తెలుస్తోంది. ఇలా సాయంత్రం 4.50 గంటల వరకు రేవంత్, ఉదయ్‌సింహాను విచారించిన అధికారులు మళ్లీ ఈ నెల 23న విచారణకు హాజరవ్వాలని చెప్పడంతో 5.00 గంటల సమయంలో వారు ఆయకార్‌ భవన్‌ నుంచి బయటకు వచ్చారు.  

అధికారుల ముసుగులో కేసీఆర్‌ సైన్యం: రేవంత్‌రెడ్డి 
విచారణ అనంతరం బయటకు వచ్చిన రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనను విచారిస్తున్న అధికారులతో పాటు అధికారుల ముసుగులో కేసీఆర్‌ ప్రైవేట్‌ సైన్యం కూడా ఉందని ఆరోపించారు. ఐటీ అధికారుల పేరు చెప్పి డీఐజీ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు తమ ఇంట్లో అర్ధరాత్రి దాడులు చేసి భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. తనను వేధించేందుకు కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు విభాగాలను ఉపయోగించుకుంటున్నారని, తాను ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తేలేదని.. న్యాయబద్ధంగా, రాజకీయంగా వీటన్నింటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇంట్లో సోదాలు చేసిన సమయంలో, ఇప్పుడు విచారణలో అధికారులకు అన్ని వివరాలు డాక్యుమెంట్లతో సహా సమాధానమిచ్చానన్నారు. తమతో పరిచయం లేని రణధీర్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులమని చెప్పి అర్ధరాత్రి దాడులు చేసి వేధించిన విషయంపై ఆదాయపు పన్ను కమిషనర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. దీనిపై నగర కమిషనర్‌తో పాటు డీజీపీకి ఫిర్యాదు చేస్తానని, ఇలాంటి వేధింపులకు భయపడే ప్రసక్తేలేదన్నారు. ఐటీ అధికారులు లేవనెత్తిన మరిన్ని అంశాలపై వివరణ ఇచ్చేందుకు 23న రావాలన్నారని, తాను విచారణకు హాజరవుతానని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

ప్రతీక్షణం ఏపీ ఇంటెలిజెన్స్‌ అప్‌డేట్‌...
ఐటీ అధికారులు రేవంత్‌రెడ్డిని విచారిస్తున్న ఆయ్‌కార్‌ భవన్‌ వద్ద ఏపీ ఇంటెలిజెన్స్‌ అధికారులు తచ్చాడారు. 8 మందితో కూడిన అధికార బృందం రేవంత్‌ విచారణ అంశాలను ఎప్పటికప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులకు అప్‌డేట్‌ చేశారు. విచారణలో వెల్లడిస్తున్న అంశాలపై కూడా ఆరా తీసి సాయంత్రానికల్లా పూర్తి నివేదిక ఏపీ సీఎం చంద్రబాబుకు పంపించేలా బృందాలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఐటీ సోదాల దెబ్బతో ఏపీలోని పలువురు నేతలు, మంత్రులు వణికిపోతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు