-

మోదీని రాహుల్‌ జయించాలంటే..?

28 May, 2019 14:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఎదురైన పరాజయానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన పదవికి రాజీనామా చేశారని, ఆయన రాజీనామాను శనివారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ద్వంద్వంగా తిరస్కరించిందని, అయినప్పటికినీ ఆయన రాజీనామా ఉపసంహరణకు తిరస్కరించారని, చివరకు ఆయన రాజీనామాకు సోనియా గాంధీ ఆమోదం తెలిపారని శనివారం నుంచి నేటి వరకు వరుసగా వస్తున్న వార్తలు. ప్రస్తుతానికి ఇదంతా ఓ రాచ కుటుంబంలో జరుగుతున్న ఓ డ్రామాగా, ఓ ప్రవహసనంలా కనిపిస్తోంది.

ప్రజాస్వామిక పార్టీలో గెలుపోటములకు నాయకులు నైతిక బాధ్యత వహించడం, ఓటమి సమయాల్లో పదవులకు రాజీనామా చేయడం పరిపాటిగా మారిన పరిణామమే. కానీ ఇక్కడ రాజీనామా చేసిన వ్యక్తి పట్టాభిషేకం కోసం ఎదురుచూస్తోన్న యువరాజు. ఓ మాజీ ప్రధానికి ముని మనవడు, మరో మాజీ ప్రధానికి మనవడు, మరో మాజీ ప్రధానికి పుత్రరత్నం. అంతటి వాడు రాజీనామా చేశారంటే అలకపాన్పు ఎక్కిన యువరాజే కళ్లముందు కదులుతారు. శనివారం జరగిన సీడబ్ల్యూ సమాశం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న పార్టీ కీలక సమావేశంలా కనిపించలేదు. రాజదర్బారుగానే కనిపించింది. రత్నకచిత స్వర్ణ సింహాసనం లేకపోయినా, సోనియా గాంధీ ఆసీనులైన మహారాణిలాగే కనిపించారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు పార్టీ విజయావకాశాల గురించి పట్టించుకోకుండా తమ కుమారులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకే ఎక్కువ ప్రయత్నించారని ఆ దర్బారులో రాహుల్‌ గాంధీ ఆరోపించడం యువరాజు తీరులాగే కనిపించింది.

మధ్యప్రదేశ్‌లో సింధియాల నుంచి అస్సాంలో గొగోయ్‌లు, పశ్చిమ బెంగాల్‌లో ఖాన్‌ చౌదరీల వరకు వారసత్వ రాజకీయాలు నెరపుతున్న భూస్వాములే. కొడుకులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు తాపత్రయ పడే తండ్రులే. రాహుల్‌ ఆరోపణల్లో నిజం లేదని కాదు. ఆయన పార్టీలోకి ప్రవేశించిన వైనాన్ని కూడా ఓ సారి గుర్తు చేసుకోవాలి. వారసత్వ రాచ కుటుంబంలో జరిగినట్లుగానే 2013లో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ నియమితులయ్యారు. ఆయన పదవి కోసం ఎవరు పోటీ పడలేదు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత అధ్యక్షుడిగా కూడా అలాగే ఎంపికయ్యారు. ఆ మాటకొస్తే వారసత్వ రాజకీయాలకు మన దేశంలో ఏ పార్టీ అతీతం కాదు. పాలకపక్ష బీజేపీలో వారసత్వ వారసులు ఇతర పార్టీలకన్నా ఎక్కువ ఉన్నారు. అయినా అది ఎప్పుడు చర్చనీయాంశం కాదు. ఎందుకంటే వారు పార్టీని నడిపించే జాతీయ నాయకత్వంలో లేరు.

రాహుల్‌ గాంధీ పార్టీ నాయకత్వంలో ఉన్నారు కనుకనే నేడు కాంగ్రెస్‌ పార్టీ చక్రవర్తి, సామంత రాజుల వ్యవస్థలాగే కనిపిస్తోంది. అలాంటప్పుడు పార్టీలోని నాయకులు పదవుల కోసం ప్రాకులాగుతారు తప్పా, పార్టీ విజయం కోసం ప్రయాస పడరు. రాహుల్‌ గాంధీ రాజీనామా నాటకం కాకుండా నిజమే అయితే, ఆయన రాజీనామాను ఆమోదించి మరో సమర్థుడైన అధ్యక్షుడిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించాలి. అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అక్కడి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ కమిటీలను పునరుద్ధరిస్తూ వాటి అధ్యక్ష కార్యదర్శులను ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకుంటూ రావాలి. చిట్ట చివరికి పార్టి అధ్యక్షుడిని కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నుకోవాలి. అప్పుడుగానీ పార్టీకి కొత్త జవసత్వాలు రావు. ఈ ప్రక్రియను పూర్తి చేసే వరకు పార్టీకి అపద్ధర్మ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ కొనసాగినా ఫర్వాలేదు. ప్రజాస్వామ్య ప్రిక్రియలో కూడా పార్టీ రాహుల్‌ గాంధీనే కోరుకుంటే ఆయనకు అంతకన్నా అదృష్టం మరోటి ఉండదు. అప్పటికీ నరేంద్ర మోదీ లాంటి నాయకుడిని ఎదుర్కొనే పరిణతి కచ్చితంగా వచ్చి తీరుతుంది. అంతటి ఓపిక, శక్తి తనకు లేదనుకుంటే రాజకీయాలకు సెలవు చెప్పి రాహుల్‌ గాంధీ మాల్దీవులకు వెళ్లిపోవచ్చు!

మరిన్ని వార్తలు