జగన్‌తో సినీ నటుల భేటీ దురదృష్టకరం 

21 Feb, 2019 04:58 IST|Sakshi

పుల్వామా దాడిపై ప్రజల్లో అనుమానాలున్నాయి 

రాజకీయ లాభాల కోసం సైన్యంతో ఆటలాడుతున్న బీజేపీ ప్రభుత్వం 

టీడీపీ నాయకులతో చంద్రబాబు  

సాక్షి, అమరావతి: జగన్‌తో సినీనటులు సమావేశమవడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి సమావేశాల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. సినీ ప్రముఖుడు నాగార్జున మంగళవారం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను కలిసిన నేపథ్యంలో చంద్రబాబు బుధవారం టీడీపీ నాయకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధికి అందరూ అండగా ఉండాలన్నారు. హైదరాబాద్‌లో ఆస్తులను చూపించి బెదిరింపులు చేయడం వల్లే టీడీపీకి కొందరు దూరం అవుతున్నారని, ఆస్తులు కాపాడుకునేందుకే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని విమర్శించారు. అభ్యర్థుల ఎంపికను ప్రజాభిప్రాయం ప్రకారం చేస్తామని తెలిపారు.

ప్రత్యక్ష ఎన్నికల్లో కొందరికి అవకాశం రాదని, అలాంటి వారికి నామినేటెడ్‌ పోస్టుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ రూ. 10 వేలు పెంచామని, ప్రైవేటు పాఠశాలలకు పలు రాయితీలు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ లబ్ధి పొందిన వారంతా టీడీపీ వెంటే ఉంటారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ తప్పుడు సర్వేలు చేస్తోందని, ఇతరులు సర్వే చేస్తే అడ్డుంకులు పెడుతోందని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం జరిగి సరిగ్గా ఐదేళ్లయిందని, నమ్మక ద్రోహానికి ఐదవ వార్షిక నిరసనలు జరపాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హాదాతో సహా మిగిలిన ఐదు హామీలను గాలికి వదిలేశారని, పారిశ్రామిక రాయితీలు ఇవ్వలేదని చెప్పారు. 

మమత వ్యాఖ్యలతో చర్చ జరుగుతోంది...
స్వార్థంతో దేశ భద్రతను ఫణంగా పెడితే సహించేది లేదని, రాజకీయ లాభాల కోసం సైన్యంతో ఆటలాడితే సహించమని చెప్పారు. పుల్వామా దాడిపై ప్రజల్లో అనుమానాలున్నాయని,పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలతో దేశంలో చర్చ జరుగుతోందని తెలిపారు. పాకిస్తాన్‌ ప్రధాని వ్యాఖ్యలపై అనేక అనుమానాలున్నాయని, పాలకుల అసమర్థతతో దేశ భద్రతకు ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రజల్లో బీజేపీ పూర్తిగా పలుచనైందని, అందుకే చిన్నాచితకా పార్టీలతో పొత్తుల కోసం ఆరాటపడుతోందని విమర్శించారు. అధికారం కోసం బీజేపీ దేనికైనా దిగజారుతుందన్నారు. 

మరిన్ని వార్తలు