ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆపరేషన్‌ నంది’ : ఐవైఆర్‌

30 Jun, 2018 15:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మరోసారి విరుచుకుపడ్డారు. ఆ ప్రభుత్వం తన అవినీతి, అసమర్థత, తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక పథకం ప్రకారం ఇతరులపై నిందలు మోపడం అలవాటుగా మార్చుకుందని దుయ్యబట్టారు. ఇలాంటి వాటన్నింటి కోసం ప్రస్తుతం రాష్ట్రంలో ఆపరేషన్ నంది అమలవుతోందని ఆయన చెప్పారు. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు లేదా ఇబ్బందిపెట్టే అంశాలు తెరమీదకొచ్చినప్పుడు వాటినుంచి తప్పించుకోవడానికి జాతీయస్థాయి కుట్రగా అభివర్ణించడం వంటి చర్యలన్నీఈ ఆపరేషన్ నందిలో భాగమేనని వివరించారు. అధినేతలు దిగజారి వ్యవహరిస్తున్నారని, భవిష్యత్తులో ఇలాంటి అంశాలు తెరమీదకొచ్చినప్పుడు అంతర్జాతీయ కుట్రలుగా అభివర్ణించి సీఐఏ హస్తముందని అభియోగం మోపే అవకాశం ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

ఎవరైనా నిజాలు మాట్లాడి ప్రజల్లోకి వెళినపుడు ప్రమాదమని గ్రహిస్తే చాలు... అలాంటి వారి విశ్వసనీయతను, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి తెరవెనుక కుట్రలకు పాల్పడుతారని ఆయన ధ్వజమెత్తారు. నిజాలు వెలుగులోకి తెచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందిస్తే.. నీచస్థాయికి దిగజారి చిన్నచిన్న అంశాలపై భూతద్దంలో చూపిస్తూ వారిపట్ల అమానవీయంగా కుట్రలకు తెగబడుతున్నారని చెప్పారు. అందుకు వాటి అనుకూల ప్రసార మాధ్యమాలు, మేధావి వర్గాన్ని సైతం వాడుకుంటున్నారని తెలుగుదేశం అధినేతపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

మరిన్ని వార్తలు