ఆ అభ్యర్థి ఆస్తి రూ.1,76,00,00,000

5 Apr, 2019 10:55 IST|Sakshi

తమిళనాడులోని పెరంబూరు శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న జె.మోహన్‌రాజ్‌ అనే అభ్యర్థి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తి ఇది. అంతేకాదు. ఆయన ప్రపంచ బ్యాంకు నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు కూడా తీసుకున్నారట. ఆ విషయం కూడా అఫిడవిట్‌లో స్పష్టంగా చెప్పారు. పదవీ విరమణ చేసిన పోలీసు అధికారి అయిన మోహన్‌రాజ్‌ పేర్కొన్న ఈ ఆస్తి, అప్పుల వివరాలు నమ్మశక్యంగా లేవు కదూ.. అయినా ఆయన అఫిడవిట్‌ను ఎన్నికల సంఘం ఆమోదించడం ఆశ్చర్యకరం. తనకు గతంలో చాలా ఆస్తి ఉందని, 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు తన దగ్గర రూ.1,977 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.

ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4 లక్షల కోట్లు అప్పు తీసుకున్నట్టు చెప్పిన మోహన్‌రాజ్‌  చెల్లించాల్సిన రుణాల కాలమ్‌లో ఏమీ లేవని పేర్కొనడం విశేషం. తన దగ్గర రూ.1,76,00,00,000 (176 కోట్లు) నగదు ఉందని ఆయన తెలిపారు. అయితే, ఎన్నికల అఫిడవిట్‌లో ఇన్ని నమ్మశక్యం కాని లెక్కలెందుకు చూపించారని అడిగితే, ఆస్తులు, అప్పులకు సంబంధించి నాయకులు ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారో, ఎన్నికల నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తున్నారో చెప్పడానికే తానీ పని చేశానని అంటున్నారు. ‘బడా రాజకీయ నాయకులు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తిపాస్తులు, అప్పుల వివరాలన్నీ నిజమే అయితే. నేను చెప్పినవి కూడా నిజమే’ అని ఆయన స్పష్టం చేస్తున్నారు. తన సొమ్మంతా స్విస్‌ బ్యాంకులో ఉందని ఆ నల్ల ధనాన్నంతా వెనక్కి తెస్తే ఆ జాబితాలో తన పేరు కూడా ఉంటుందని మోహన్‌రాజ్‌ ముక్తాయించారు.

మరిన్ని వార్తలు