బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా జేపీ నడ్డా

17 Jun, 2019 20:11 IST|Sakshi

బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం

జాతీయ అధ్యక్షుడిగా కొనసాగనున్న అమిత్‌ షా

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి జేపీ నడ్డా ఎన్నికయ్యారు. సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం జేపీ నడ్డాకున్న నేపథ్యంలో ఆయనకు ఈ పదవిని అప్పగించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న జేపీ.. మోదీ గత ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన ఉత్తర ప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌గాబాధ్యతలు చేపట్టిన నడ్డా.. 62 ఎంపీ స్థానాల్లో గెలుపుకు కృషి​ చేశారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ జాతీయ నాయకత్వం కీలకమైన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిలో నియమించింది. జాతీయ అధ్యక్షుడిగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షానే కొనసాగనున్నారు.

ఏడాది చివరలో పలు రాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో షానే సారథిగా కొనసాగించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా 2014, 19 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కృషి చేసిన అమిత్‌ షా.. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో గుజరాత్‌లోని గాంధీనగర్‌ స్థానం నుంచి ఎన్నికయ్యారు. దీంతో మోదీ ప్రభుత్వంలో హోంశాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడిగా నూతన వ్యక్తిని నియమిస్తారనే ప్రచారం జరిగింది. రానున్న ఏడాది కాలంలో కీలకమైన రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ, బెంగాల్‌లో పార్టీ విస్తరణ బాధ్యతలు ఉండడంతో షానే ఆ పదవిలో కొనసాగనున్నారు.

మరిన్ని వార్తలు