తెలంగాణకు అసలు ద్రోహి కాంగ్రెస్సే

27 Feb, 2018 02:32 IST|Sakshi

ప్రజలు ప్రశ్నిస్తారనే పాదయాత్ర చేయడం లేదు

నిప్పులు చెరిగిన మంత్రి జగదీశ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు అసలు ద్రోహి కాంగ్రెస్‌ పార్టీయేనని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. చేసిన పాపాలు, మోసాలు, రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి ప్రశ్నిస్తారన్న భయం తోనే కాంగ్రెస్‌ నేతలు పాదయాత్ర కాకుండా బస్సుయాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. యాత్ర ఎందుకు చేస్తున్నారో, ప్రజలకు ఏం చెప్పదలచుకున్నారో ఆ పార్టీ జాతీయ నాయకులతో చెప్పించాలన్నారు.

సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నాటి సీఎం వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్రకు, కాంగ్రెస్‌ తాజా బస్సు యాత్రకు పోలికే లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ మునిగిపోయే నావ అని, ఆ పార్టీలో ఉన్నవాళ్లే బయటకొస్తున్నారని చెప్పారు. జేఏసీ కాగితపు పడవని, దాంట్లో ఎవరు ప్రయాణం చేయాలనుకుంటారని ప్రశ్నించారు.  

ఇక్కడ ప్రజలున్నారని గుర్తిస్తున్నారా..?
రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ తెలంగాణపై మరోసారి విషం కక్కారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఆంధ్రాకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న రమేశ్‌.. తెలంగాణలోని ప్రాణహిత చేవెళ్ల గురించి, ఆంధ్రాలో కలిపిన మండలాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగు నీరుపై ఎందుకు మాట్లాడరని నిలదీశారు. తెలంగాణ ఇస్తా మని 2004, 2009లో ప్రకటించి వందల మంది ప్రాణాలు కోల్పోడానికి కారణమయ్యారన్నారు. తెలంగాణలో ప్రజలున్నారని, వారి సమస్యల పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని కాంగ్రెస్‌ జాతీయ నేతలు గుర్తిస్తున్నారా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌.. ఆంధ్రా పక్షపాతి
రాష్ట్రంలోని భూములు దశాబ్దాలుగా బీళ్లు పడి ఉంటే ప్రాజెక్టులెందుకు పూర్తి చేయలేదని కాంగ్రెస్‌ను జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణపై కాంగ్రెస్‌కు చిన్నచూపని, ఆ పార్టీ ఎప్పూడూ ఆంధ్రా పక్షపాతిగానే ఉందని ఆరోపించారు. ఆంధ్రాలో కాంగ్రెస్‌కు ఒక్క సీటివ్వకున్నా, ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు రాకున్నా పార్టీ జాతీయ నాయకులు ఇప్పటికీ ఆంధ్రాపైనే ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో 2014 ఎన్ని కల్లో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, వచ్చే ఎన్నికల్లో ఆ పొరపాటు జరగదని, ఒక్కసీటు కూడా ఇవ్వకుండా ప్రజలు బుద్ధిచెబుతారని హెచ్చరించారు.  

బీజేపీ కేంద్రం నుంచి నిధులు ఇప్పించవచ్చు కదా..
రాష్ట్రాన్ని మోసం చేయడంలో కాంగ్రెస్‌తోపాటు బీజేపీ పోటీపడుతోందని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రం లో ఎప్పటికీ అధికారంలోకి రాలేమని తెలిసిన ఆ పార్టీ నేతలు రూ. 20 లక్షలైనా మాఫీ చేస్తామని హామీలిస్తారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ రుణమాఫీ ఎందుకు చేయడం లేదన్నారు. రుణమాఫీ, రైతుల పెట్టుబడి సాయం కోసం కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులిప్పించొచ్చు కదా అని బీజేపీ నేతలను నిలదీశారు.  

మరిన్ని వార్తలు