‘జగన్‌ అన్న ఫర్‌ సీఎం’ 

22 Dec, 2018 08:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రజలను అన్ని రకాలుగా ఆదుకునేందుకు నవరత్న కార్యక్రమాలు సహా అనేక పథకాలను అమలు చేయడానికి నిర్ణయించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. వీటిపై సమగ్ర సమాచారంతో ‘జగన్‌ అన్న ఫర్‌ సీఎం’ అనే నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రజా సంకల్పయాత్రలో ఈ వెబ్‌సైట్‌ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించింది. నవరత్నాలు, మీడియా, గ్యాలరీ, ప్రజా సంకల్ప యాత్ర, వైఎస్సార్‌ కుటుంబం, జగన్‌ స్పీక్స్‌ విభాగాలుగా ఇందులో ఆయా అంశాలను పార్టీ పొందుపరిచింది.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నవరత్న కార్యక్రమాలు, ఇతర పథకాల అమలు ద్వారా ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని పంచేందుకు వీలుగా అందరి తోడ్పాటుకు పిలుపునిచ్చింది. ఆయా కార్యక్రమాలపై సవివరంగా సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచారు.  వైఎస్సార్‌ ఆసరా, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, అందరికీ పక్కా ఇళ్లు, వైఎస్సార్‌ రైతు భరోసా, అమ్మ ఒడి, పింఛన్లు, మద్యవిధానం ఇలా ఆయా అంశాలను వివరించారు. ఈ వెబ్‌సైట్‌లో డిజిటల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ద్వారా అభిమానులు, ప్రజాశ్రేయస్సుకోరే వారంతా కార్యక్రమాల అమలుకు చేయూతనందించవచ్చు.  

ఘనంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు 
శ్రీకాకుళం అర్బన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నేతలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో పార్టీ నేతల సమక్షంలో వైఎస్‌ జగన్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండేలా భగవంతుడి ఆశీస్సులు లభించాలని వేదపండితులు ఆశీర్వదించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు భూమన కరుణాకరరెడ్డి, తలశిల రఘురాం, పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, మాజీ ఎంపీ మిధున్‌రెడ్డి, పీఏసీ సభ్యులు పాలవలస రాజశేఖరం, ధర్మాన కృష్ణదాస్, పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, పాలకొండ, రాజాం ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, పార్టీ పాతపట్నం, ఎచ్చెర్ల, టెక్కలి, పలాస నియోజకవర్గ సమన్వయకర్తలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, పేరాడ తిలక్, సీదిరి అప్పలరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్, అరకు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, పార్టీ నేతలు నర్తు రామారావు, ప్రధాన రాజేంద్ర, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయ్, దువ్వాడ వాణి, చింతాడ మంజు, హనుమంతు కిరణ్‌కుమార్, తమ్మినేని చిరంజీవి నాగ్, ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.  

వైఎస్సార్‌సీపీలోకి భారీగా టీడీపీ శ్రేణులు 
శ్రీకాకుళం అర్బన్‌: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుటుంబ సభ్యులు, పలువురు టీడీపీ నాయకులు శుక్రవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి ఆధ్వర్యంలో కలమట వెంకటరమణ మరదలు, టీడీపీ నాయకురాలు కలమట సుప్రియ తన అనుచరులతో కలిసి పాదయాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్‌ జగన్‌ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆమెతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన టీడీపీ నేతలు కూడా పార్టీలో చేరారు. సుప్రియ మాట్లాడుతూ టీడీపీ పాలనలో అర్హులకు పథకాలు అందడం లేదన్నారు. వైఎస్సార్‌ ఆశయాల సాధన కోసం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్‌ జగన్‌ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పార్టీలో చేరినట్లు తెలిపారు.
కాశీపురంలో కలమట సుప్రియకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్రతిపక్ష నేత 

కుప్పం మండల తెలుగు యువత అధ్యక్షుడి చేరిక 
అలాగే మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కుప్పం మండల తెలుగు యువత అధ్యక్షుడు బి.మునుస్వామి వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్‌ జగన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.  

మరిన్ని వార్తలు