టీఆర్‌ఎస్‌లోకి కొనసాగుతున్న వలసలు

17 Mar, 2019 00:39 IST|Sakshi

కాంగ్రెస్‌కు ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఆరేపల్లి గుడ్‌బై?

అనుచరులతో ఎమ్మెల్యేలు హర్ష, జగ్గారెడ్డి భేటీ

ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. టీపీసీసీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్‌ కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. లోక్‌సభ టికెట్ల కేటాయింపులో పార్టీ వ్యవహారశైలికి నిరసనగా ఆయన పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరేందుకు కూడా ఆయనకు లైన్‌క్లియర్‌ అయిందని తెలుస్తోంది. ఈ మేరకు కరీంనగర్‌ ఎంపీ బి. వినోద్‌ కుమార్‌ను కలసి మోహన్‌ చర్చించినట్లు గాంధీ భవ న్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు వెళ్లిపోగా మరో ఇద్దరు కూడా పార్టీ ని వీడతారనే చర్చ జరుగుతోంది. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం వారి నియోజకవర్గాల్లో అనుచరులతో సమావేశమై పార్టీలో కొనసాగాలా లేదా అనే దానిపై అభిప్రాయం సేకరించారు. ఒకట్రెండు రోజుల్లో వారు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులుగా పనిచేస్తున్న రేగుల పాటి రమ్యారావు, మన్నె క్రిశాంక్‌లు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో యువతకు భవిష్యత్తు లేనందునే పార్టీని వీడుతున్నట్లు క్రిశాంక్‌ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు