13 రోజులు చుక్కలు చూపించారు 

25 Sep, 2018 03:12 IST|Sakshi

     ప్రజలు ఆశీర్వదిస్తే కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తా

     కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఏర్పాటు తర్వాత తమను పాలించడానికే తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ కుటుంబాన్ని ఎన్నుకున్నారని, ఎదిరించే వారిపై కేసులు పెట్టేందుకు కాదని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) వ్యాఖ్యానించారు. చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం సోమవారం రాత్రి గాంధీభవన్‌లో తన సతీమణి, ఇతర నేతలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 13 రోజులపాటు తనకు చుక్కలు చూ పించారని, ప్రజలు ఆశీర్వదిస్తే తాను కేసీఆర్‌కు చుక్కలు చూపెడతానని అన్నారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎటు పోయింది. పోలీసులు కూడా పక్షపాతంగా పోకూడదు. ప్రభుత్వమే సుమోటోగా కేసు పెట్టింది. 2004 కేసులో నా పేరు లేదు. హరీశ్, కేసీఆర్‌ల పేర్లు ఉన్నాయి. నేను తప్పు చేశానా లేదా అన్నది కోర్టు తేలుస్తుంది. న్యాయపరంగా ఎదుర్కొంటా’అని జగ్గారెడ్డి వెల్లడించారు. కేసీఆర్‌ జీవితంలో ఏ తప్పూ చేయలేదా? టీఆర్‌ఎస్‌ నేతల మీద ఆరో పణలు లేవా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబానికి ప్రజ లు బుద్ధి చెబుతారని అన్నారు.

రాహుల్‌ సభ తర్వాత తనను టార్గెట్‌ చేశారని, మానసికంగా ఇబ్బంది పెడితే ప్రజల పక్షాన ఎలా కొట్లాడగలుగుతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఆ కేసు విషయం ఎందుకు గుర్తొచ్చిందని ప్రశ్నించారు. తాము అ«ధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలానే చేస్తే మీ పరిస్థితేంటని, ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడకపోతే తనకేం కాదని, ప్రజలే నష్టపోతారని అన్నారు. తాను ఎవరి కడుపూ కొట్టలేదని, దోపిడీలు చేయలేదని తెలిపారు. ధైర్యంగా మాట్లాడే తననే భయపడే పరిస్థితికి తీసుకువచ్చారని చెప్పారు. గతంలో కేసీఆర్‌ దొంగనోట్ల వ్యాపారం, పాస్‌పోర్టు బ్రోకర్‌ దందా చేశారన్నారు. పద్మా దేవేందర్‌రెడ్డి చరిత్ర అందరికీ తెలుసని అన్నారు. ప్రజాక్షేమం కోరే నాయకులు కావాలో, ప్రజలను అణగదొక్కే నాయకులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. త్వరలో 5 లక్షల మందితో సభ నిర్వహిస్తానన్నారు.

బెయిల్‌పై జగ్గారెడ్డి విడుదల  
మానవ అక్రమ రవాణా, తప్పుడు పాస్‌పోర్టుల కేసుల్లో అరెస్టయిన కాంగ్రెస్‌ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి)కి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ.50 వేల విలువైన బాండ్లతోపాటు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు, ప్రతి ఆదివారం సికింద్రాబాద్‌ మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాల్సిందిగా షరతులు విధిస్తూ సికింద్రాబాద్‌లోని 22వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సోమవా రం బెయిల్‌ మంజూరు చేశారు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాకు వెళ్తున్నామని జగ్గారెడ్డి పాస్‌పోర్టులు తీసుకుని అమెరికా వెళ్లారని, తిరిగి ఆయన ఒక్కరే వచ్చారన్న పాస్‌పోర్టు అధికారి ఫిర్యాదు మేరకు మార్కెట్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను 10న అరెస్ట్‌ చేశారు. బెయిల్‌ కోసం అప్పుడు దరఖాస్తు చే సుకోగా కోర్టు తోసిపుచ్చింది. కోర్టు రిమాండ్‌ ఆదేశాల మేరకు 14 రోజులు చంచల్‌గూడ జై ల్లో ఉన్నారు. తాజాగా ఆయనకు కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో చంచల్‌గూడ జైలు నుంచి సోమవారం విడుదలయ్యారు.  

మరిన్ని వార్తలు