'లోక కళ్యాణం కోసమే పీసీసీ పదవి అడుగుతున్నా'

14 Nov, 2019 14:22 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : తెలంగాణలో మంచి పాలన రావాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమని, తాను లోక కళ్యాణం కోసమే పీసీసీ పదవి అడుగుతున్నాని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ పార్టీలలో పనిచేసిన అనుభవం ఉందని, పీసీసీ అవకాశం ఇస్తే వారిని ఎలా ఎదుర్కొవాలో తెలుసని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పీసీసీ పదవి నుంచి వైదొలిగిన తర్వాత తనకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీని ఇదివరకే కోరినట్లు తెలిపారు.

దీనికి సంబంధించి ఇప్పటికే నా పూర్తి బయోడేటా వివరాలను సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీ, అహ్మద్‌ పటేల్‌ వంటి కీలక నేతలందరికి రిజిస్టర్‌లో పోస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఒకవేళ తనకు పీసీసీ పదవి లభిస్తే ఎటువంటి షరతులు లేకుండా సోనియా, రాహుల్‌ సూచనల మేరకు పనిచేస్తానని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్‌ రాచరిక పాలనను నిలదీసే ధైర్యం ఆ పార్టీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందని, ఎవరు తప్పు చేసినా నిలదీసే హక్కుతో పాటు అవసరమైతే పదవి నుంచి తొలగించే అధికారం ఉంటుందని వెల్లడించారు.

సోనియా, రాహుల్‌ అడుగుజాడల్లో పార్టీ నడుస్తుందని, ఎవరికి వారే హీరోలు అనుకుంటే కాంగ్రెస్‌లో నడవదని వివరించారు. డబ్బు ఉంటేనే అధిష్టానం పీసీసీ పదవి ఇస్తుందనేది అవాస్తవమని పేర్కొన్నారు. గతంలో డబ్బు లేకున్నా డి. శ్రీనివాస్‌, కేశవరావు వంటి వ్యక్తులు  పీసీసీ పదవులు లభించలేదా అంటూ గుర్తుచేశారు. కాంగ్రెస్‌లో లాబీయింగ్‌ ఉన్నా క్యారెక్టర్‌ను కూడా పార్టీ పరిగణలోకి తీసుకుంటుందని స్పష్టం  చేశారు. తాను బహిరంగంగా అన్ని విషయాలు చెప్పాలని అనుకున్నట్లు తెలిపారు. ఈమేరకు తన మీద ఉన్న కేసులను ఏఐసీసీకి పంపిన బయోడేటాలో పేర్కొన్నట్లు జగ్గారెడ్డి స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు