విజయశాంతికి మంచి రాజకీయ భవిష్యత్‌: జగ్గారెడ్డి

8 May, 2019 13:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి స్పందించారు. విజయశాంతి తనపై చేసిన విమర్శలకు తాను కౌంటర్‌ ఇవ్వబోనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మల్యే జగ్గారెడ్డి బుధవారమిక్కడ విలేకరులతో చిట్‌చాట్‌ చేశారు. ‘విజయశాంతికి పీసీసీ చీఫ్‌ కావాలనే కోరిక ఉందమో. ఆమె సినిమా స్టార్‌గా ప్రజల్లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. విజయశాంతి వల్ల కాంగ్రెస్‌కు ఉపయోగమే. ఆమె సేవలను దక్షిణాది రాష్ట్రాల్లో వాడుకుంటే పార్టీకి ఉపయోగం. పార్టీ కోసం మరింత సమయం వెచ్చిస్తే విజయశాంతికి మంచి రాజకీయ భవిష్యత్‌ ఉంటుంది. రాబోయే రోజుల్లో పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టేవాళ్లు...ముఖ్యమంత్రి పదవిపై ఆశలు లేకుండా పార్టీ కోసం పని చేయాలి. పీసీసీ పీఠం కావాలనుకునేవాళ్లు తమ సొంత ఖర్చులతో పార్టీని నడిపేలా ఉండాలి. అప్పుడే పీసీసీకి కాబోయే సీఎంకు మధ్య సమన్వయం ఉంటుంది.

పదవుల కోసం, డబ్బు కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసేవాళ్లు కాంగ్రెస్‌లో పుష్కలంగా ఉన్నారు. ఈ అంశంపై త్వరలో పార్టీ అధినేత రాహుల్‌ గాంధీకి లేఖ రాస్తా. పార్టీ కోసం పనిచేసిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అప్పుల్లో ఉన్నారనేది వాస్తవం. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ ఎదుగదలకే పని చేశారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశతో ఆయన పనిచేయలేదు. ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టాక పార్టీకి ఫాయిదా లేదన్నది సరికాదు. పార్టీ క్యాడర్‌లో ఉత్తమ్‌ మనోధైర్యం నింపగలిగారు. సీనియర్లు అంతా పీసీసీకి సమన్వయంతో పనిచేసినప్పుడే పార్టీకి మనుగడ. ఎమ్మెల్యేలు పార్టీ వీడటం ఉత్తమ్‌ వైఫల్యం కాదు. సొంత ప్రయోజనాల కోసమే ఫిరాయింపులు. ఉత్తమ్‌, కుంతియ అమ్ముడుపోయారనేది సరికాదు. వాళ్లను ఎవరు కొనలేరు. ఇక పార్టీలో కోవర్టులు ఎవరనేది సమయం వచ్చినప్పుడు చెబుతా.’ అని అన్నారు.


 

మరిన్ని వార్తలు