పులులు కాదు స్వాతికులు కావాలి: జగ్గారెడ్డి

23 May, 2019 22:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తామని తాము భావించామని, అయితే మూడు స్థానాల్లో గెలుపొందినా తాము సేఫ్‌ జోన్‌లో ఉన్నామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ 4 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందడం వల్ల తమకేమీ నష్టం లేదని, టీఆర్‌ఎస్‌ మాత్రం డేంజర్‌ జోన్‌లో పడిందని ఆయన చెప్పారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని, ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్‌ల రూపంలో మూడు పులులు విజయం సాధించాయని చెప్పారు. 

బీజేపీ గెలుపుతో రాష్ట్రంలో తమకు నష్టమేమీ లేదని, ప్రస్తుతం రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలు 2023లో మూడు పార్టీల మధ్య జరుగుతాయని అన్నారు. భవిష్యత్తులో తమ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లబోరని, టీఆర్‌ఎస్‌ నేతలే బీజేపీలోకి వెళతారని చెప్పారు. నల్లగొండ ఎంపీగా ఉత్తమ్‌ గెలుపొందడం ద్వారా ఖాళీ అయ్యే హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానంలో కూడా తాము విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఇప్పుడు పులులు అవసరం లేదని, వేద మంత్రాలు చదివే సాత్వికులు కావాలని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు