‘ఎవరు సీఎం అయినా.. ఏక ఛత్రాధిపత్యం ఉండదు’

22 Nov, 2018 17:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కూటమి 75 స్థానాల్లో విజయం సాధిస్తుందని, ఎవరు సీఎం అయినా.. ఏక ఛత్రాధిపత్యం ఉండదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జైపాల్‌ రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఎవరు సీఎం అయినా కాంగ్రెస్‌ పెద్దలు వారికి అండగా ఉంటారని చెప్పారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేక పవనాలు, కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయని పేర్కొన్నారు. టీడీపీతో ఎలాంటి రాజీ ఉండదని, రివర్ వాటర్ అగ్రిమెంట్ పార్టీల మధ్యకాదు, ప్రభుత్వాల మధ్య ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ముఖ్యంగా నీటి విషయంలో రాజీపడమని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఉన్నా.. మరొకరు ఉన్నా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘నేను కేటీఆర్‌ను గుర్తించను, కేసీఆర్ మాట్లాడితేనే స్పందిస్తా. ఉత్తమ్ భార్య సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆమెకు మినహాయింపునిచ్చాం. కూటమిలో ఇతర పార్టీలు నిలబడ్డచోట కాంగ్రెస్ కూడా బీ-ఫార్మ్స్ దాదాపు వాపస్ తీసుకుంటుంది. కాంగ్రెస్ 24, టీడీపీ 3, కూటమి బీసీలకు 27 సీట్లు ఇచ్చింది. టీఆర్‌ఎస్‌ 22 మాత్రమే ఇచ్చింది. కాళేశ్వరం రీడిజైన్ పేరిట అంచనా పెంచారు. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లులేవు, నీళ్లివ్వకుంటే ఓటడగనన్నారు. గవర్నర్లలో చెంచాలను పెట్టుకున్నారు. వాళ్ళు స్వైరవిహారం చేస్తున్నారు. 70ఏళ్లలో 70కోట్ల అప్పు చేస్తే.. నాలుగున్నరేళ్లలో లక్ష కోట్ల అప్పు చేసింది టీఆర్‌ఎస్‌ .

 ఎన్నికల తర్వాతే మహాకూటమి సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తాం. రాజకీయాలు జీవనది లాంటివి. సందర్భం, సైద్ధాంతిక అంశం రాజకీయాల్లో ప్రధానమైనవి. నరేంద్ర మోదీ సాధ్యం కానివి, అవాస్తవాలైన వాగ్దానాలు చేశారు. ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు వేస్తానన్నారు. కనీసం 15పైసలు కూడా వేయలేదు. మోదీ రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేశారు. ప్రపంచంలో ఏ ఆర్థికవేత్తలు నోట్లరద్దును ఒప్పుకోలేదు. రాఫెల్ విషయంలో ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు.. ‘అంబానీ కంపెనీని మేము ఎంపిక చేసుకోలేదు.. బలవంతంగా మాకు అంటగట్టార’ని చెప్పారు. ఎంతమంది చెప్పినా మోదీ నోరు విప్పరు. విప్పితే అబద్దాలు చెప్పాల్సి వస్తుంది. చారిత్రక నేపథ్యం లేకుండా.. స్నేహాలు, శత్రుత్వాలు ఉండవు. టీఆర్‌ఎస్‌ బీజేపీతో చాటుమాటుగా అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది. కేసీఆర్! ప్రజాసంఘాలు, మేధావులు, మైనార్టీలను మోసం చేసేందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. కేసీఆర్‌కు ఓటు వేస్తే.. మోదీకి ఓటేసినట్లే..!’’ అని అన్నారు

మరిన్ని వార్తలు