ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ఇంటిపై దాడి

16 Feb, 2020 13:16 IST|Sakshi
కార్యకర్తల దాడిలో పగిలిన ఇంటి ఇద్దాలు

పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవి కోసం ఇరువర్గాల ఆందోళన

ఒంటిపై పెట్రోలు పోసుకున్న ఇద్దరు నాయకులు

ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు

సాక్షి, కల్వకుర్తి టౌన్‌: స్థానిక ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ నాయకులే దాడిచేసిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వెల్దండ మండలం పోతేపల్లికి చెందిన సంజీవ్‌కుమార్‌యాదవ్‌ 9వ డైరెక్టర్‌ స్థానం, 7వ డైరెక్టర్‌ స్థానం నుంచి జూపల్లికి చెందిన భాస్కర్‌రావు పోటీచేసి గెలుపొందారు. వీరిలో జూపల్లి భాస్కర్‌రావుకు పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవి ఇస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న సంజీవ్‌ అనుచరులు కల్వకుర్తిలో ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ మాట్లాడుతుండగా సంజీవ్, జూపల్లి భాస్కర్‌రావు అనుచరులకు మాటమాట పెరిగి గొడవకు దారితీసి.. దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే సంజీవ్‌ అనుచరులు ఎమ్మెల్యే ఇంటికి ఉన్న కిటికీ అద్దాలను ధ్వంసం చేయడంతోపాటు ఏకంగా ఎమ్మెల్యేపై దాడిచేసేందుకు యత్నించారు. వెంటనే తేరుకున్న గన్‌మెన్లు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు. అయితే ఇద్దరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అద్దాలను ధ్వంసం చేస్తున్న సమయంలో ఓ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో డివిజన్‌లోని అన్ని పోలీస్‌స్టేషన్ల పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. 

పరిశీలించిన డీఎస్పీ.. 
ఎమ్మెల్యే ఇంటిపై దాడి సమాచారం తెలుసుకున్న డీఎస్పీ గిరిబాబు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఎమ్మెల్యే    ఇంటి  ముందు నిరసన వ్యక్తం చేస్తున్న సంజీవ్‌యాదవ్‌కు, మద్దతుదారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అనంతరం డీఎస్పీ ఎమ్మెల్యే     జైపాల్‌యాదవ్‌ను కలిసి పూర్తి వివరాలను అడిగి    తెలుసుకున్నారు.  ఈ విషయమై డీఎస్పీ స్పందిస్తూ   ఫిర్యాదు  అందితే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

మరిన్ని వార్తలు