మాయ ప్రజా జీవితానికి అనర్హురాలు: జైట్లీ

13 May, 2019 14:13 IST|Sakshi

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నా రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాయావతి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మోదీపై వ్యక్తిగత విమర్శలకు దిగిన మాయావతి ప్రజా జీవితానికి అనర్హురాలని జైట్లీ ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ మేరకు జైట్లీ మంగళవారం ట్వీట్‌ చేశారు. కాగా మోదీని చూసి బీజేపీ మహిళా నేతలు వణుకుతున్నారంటూ మాయావతి విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా తన భార్యకు దూరంగా ఉంటున్న ప్రధాని మోదీ...తమ భర్తల నుంచి ఎక్కడ దూరం చేస్తారేమోనని అని బీజేపీ మహిళా నేతలు భయపడుతున్నారని మోదీపై ఆమె వ్యక్తిగత దూషణలకు దిగిన విషయం విదితమే.

కాగా దళిత మహిళకు జరిగిన అన్యాయంపై స్పందించని మోదీ.. పార్టీలోని మహిళా నేతలకు ఎలా గౌరవం ఇస్తారని మాయావతి ప్రశ్నలు సంధించారు. మోదీ ప్రభుత్వం పనికిమాలిన రాజకీయాలు చేస్తుందని, రాజకీయాల్లో లబ్ధి పొందేందుకే అల్వార్ ఘటనపై మోదీ స్పందించడం లేదని మాయావతి పేర్కొన్నారు. మరోవైపు నరేంద్ర మోదీ కూడా మాయవతిపై విరుచుకుపడ్డారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మాయావతి మద్దతు ఉపసంహరించుకోవాలని ప్రధాని సవాల్‌ విసిరారు.

ఇక అల్వార్‌ గ్యాంగ్‌రేప్‌ ఘటనపై రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ రాజీనామా చేయాలని బీజేపీ  డిమాండ్‌ చేసింది. రాజస్తాన్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ, అత్యాచార ఘటనను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తీవ్రంగా ఖండించారు. ఈ దుర్ఘటనకు కాంగ్రెస్‌ పార్టీనే బాధ్యత వహించాలని అన్నారు. కాగా భర్తతో కలిసి ప్రయాణం చేస్తున్న ఓ దళిత మహిళపై గత నెల 26న అయిదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి...దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. 

>
మరిన్ని వార్తలు