బీసీ ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించాలి: జాజుల 

17 Oct, 2018 02:03 IST|Sakshi
కేశవరావుకు బీసీ పాలసీ పుస్తకాన్ని అందజేస్తున్న జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ కేశవరావును ఆయన కలిశారు. బీసీ సంక్షేమ సంఘం రూపొందించిన ‘బీసీ పాలసీ’ పుస్తకాన్ని కేశవరావుకు అందజేశారు. చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 50 శాతానికి పెంచటంతోపాటు గత డిసెంబర్‌లో రూపొందించిన ‘బీసీ నివేదిక’అమలు అంశాన్ని టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పొందుపరచాలని కేకేను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన.. ‘బీసీ పాలసీ’ని కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి, మేనిఫెస్టోలో పొందుపరిచేలా చూస్తానని హామీ ఇచ్చారు.   

రాజకీయ శక్తిగా ఎదగాలి 
ఖమ్మం మామిళ్లగూడెం: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు రాజకీయ శక్తిగా ఎదగాలని జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. ఖమ్మంలో మంగళవారం జరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమ్మేళన సభలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఐక్యంగా పోరాడి తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. బీసీలను వివక్ష, అణచివేతకు గురిచేస్తున్న పార్టీలకు జెండాలను మోసేవారు వాస్తవాలను గ్రహించాలని కోరారు. కుల నిర్మూలన కోసం పోరాటం చేసిన మారోజు వీరన్నను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు.

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సామాజిక న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాలో 57 శాతం ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎన్నో వేలాది మంది అమర విద్యార్థుల త్యాగాల పోరాట పునాదులపై ఏర్పడిన తెలంగాణ నేడు దొరల పాలైందని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు, కళాకారుడు సోమన్న, ప్రొఫెసర్‌ కొండా నాగేశ్వర్, బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్‌ రామారావు, టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు పాపారావు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు