ఇప్పుడు కూడా అడుక్కోవాలా..!

31 Aug, 2018 22:19 IST|Sakshi
జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ (ఫైల్‌ ఫొటో)

రాజకీయంగా బీసీలకు అన్యాయం : జాజుల శ్రీనివాస్‌

సాక్షి, నిజామాబాద్‌ : టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ మండిపడ్డారు. తెలంగాణలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు రాజకీయంగా ఎదుగుదల లేకుండా చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ సిట్టింగులకే సీట్లు ఇస్తామని చెప్పి మరోసారి బీసీలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తెలంగాణలో ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేకపోవడం విచారకరం అన్నారు. బీసీ రాజకీయ చైతన్య బస్సు యాత్రలో భాగంగా బోధన్‌ చేరుకున్న శ్రీనివాస్‌ మీడియాతో శుక్రవారం మాట్లాడారు.

2019 ఎన్నికల్లో  బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా ఇవ్వాలని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలను ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే తెలంగాణలోని 112 బీసీ కులాలు జేఏసీగా ఏకమై ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగుతామని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా రాజకీయ వాటా కోసం యాచించాల్సిన పరిస్థితులు ఉండటం బాధాకరమన్నారు. శాసించే స్థాయి కోసమే బీసీ రాజకీయ చైతన్య యాత్ర చేస్తున్నామని తెలిపారు. బీసీలను అన్యాయం చేస్తే రానున్న రోజుల్లో అన్ని పార్టీ కార్యాలయాలు టులెట్‌ బోర్డులు పెట్టుకోవాల్సి వస్తుందని ఉద్ఘాటించారు.


 

మరిన్ని వార్తలు