జనాభా ప్రకారం టికెట్లివ్వకుంటే నిరసన దీక్ష చేస్తా: జాజుల

3 Nov, 2018 01:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 56 శాతంపైగా ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీలో టికెట్లు ఇవ్వకుంటే 112 కులసంఘాలతో నిరసన దీక్ష చేస్తానని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. టీఆర్‌ఎస్, మహాకూటమి, బీజేపీ పార్టీలు బీసీలను రాజకీయంగా అణచివేయడంలో పోటీపడుతున్నాయని ధ్వజమెత్తారు. జాబితాలు ప్రకటిస్తున్నా ఆశించినమేర బీసీలకు టికెట్లు ఇవ్వట్లేదని వాపోయారు. మిగతా జాబితాలోనూ ఇదే వైఖరి అనుసరిస్తే రాష్ట్రంలోని అన్ని కులసంఘాల నేతలతో కలసి నిరసన దీక్ష చేసి పార్టీల మొండివైఖరిని ఎండగడతానన్నారు.

ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ 22, బీజేపీ 16 సీట్లను మాత్రమే బీసీలకు ఇచ్చిందని, మహాకూటమి ఇచ్చే జాబితాలో కూడా బీసీల జాడ కనిపించట్లేదన్నారు. జెండా మోసిన బీసీలను కాదని వ్యాపారవేత్తలు, రియల్‌ఎస్టేట్‌ దళారులు, సిట్టింగ్‌లు, సీనియర్లంటూ కేవలం రెండు అగ్రకులాలకు మాత్రమే టికెట్లు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు రాజకీయ న్యాయం జరుగుతుందని ఆశపడ్డామన్నారు. పిడికెడు శాతంలేని వాళ్ల చేతిలో రాష్ట్రం మొత్తం ఉండటం దురదృష్టకరమన్నారు.

మరిన్ని వార్తలు