మేనిఫెస్టోలో బీసీల ఊసేది: జాజుల 

18 Oct, 2018 03:13 IST|Sakshi
జాజుల శ్రీనివాస్‌గౌడ్‌(ఫైల్‌ ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో బీసీల ఊసేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు. అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేసిన టీఆర్‌ఎస్‌ బీసీల కనీస డిమాండ్లను మేనిఫెస్టోలో చేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరు చూస్తోంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బీసీల ఓట్లు అవసరం లేదేమోననిపిస్తోందన్నారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు బుధవారం లేఖ రాశారు. రాష్ట్ర జనాభాలో 50%కు పైగా ఉన్న బీసీలకు కేవలం 20 టికెట్లు మాత్రమే కేటాయించడమేమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించిన బీసీ ఉప ప్రణాళిక ఇంతవరకు అమలుకే నోచుకోలేదని దుయ్యబట్టారు. కల్వకుర్తిలో బీసీలంతా కలసి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను సైతం ఓడించిన సంగతిని కేసీఆర్‌ మరిచిపోవద్దని సూచించారు.  బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేవారికే తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు