పార్టీ అధ్యక్షుడిగా పవన్‌కు అది కూడా తెలియదా?

14 Sep, 2019 17:10 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంద రోజుల పాలనపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శలు హాస్యాస్పదం ఉన్నాయని కాపు కార్పొరేషన్‌ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 19 రకాల చారిత్రాత్మక బిల్లులు తీసుకొచ్చామని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న పవన్‌కు కాపులను బీసీల్లో కలిపే అంశంపై అవగాహన లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు. కాపులను బీసీల్లో చేర్చడం కోసం ఈబీసీ కోటాలో ఐదుశాతం రిజర్వేషన్ ను తీసుకుంటే ... రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్ధేశ్యంతో సీఎం జగన్‌ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు రాజా వివరించారు.

చాలా విషయాల్లో పవన్‌ అవగాహనలోపంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అన్ని నిధులను దారి మళ్లించి అవినీతి రాజ్యాన్ని స్థాపిస్తే.. అప్పుడు ఎందుకు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు అవినీతిపై పవన్‌ ఎందుకు మౌనం వహించారని నిలదీశారు. గత ప్రభుత్వ హయంలోని ఇసుక మాఫియా పవన్‌కు కలిపించలేదనా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు స్క్రిప్ట్‌ను చదవడం పవన్‌ కల్యాణ్‌ మానేయాలని లేదంటే ప్రజలు క్షమించరని రాజా అన్నారు. 

>
మరిన్ని వార్తలు