చంద్రబాబు వద్దకు జమ్మలమడుగు పంచాయతీ

23 Jan, 2019 17:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన టీడీపీకి.. ప్రస్తుత పరిణామాలు మింగుడు పడటం లేదు. వైఎస్సార్‌ సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని, రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి పదవులు సైతం అప్పగించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు.. వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుంది. తాజాగా చంద్రబాబు వద్దకు జమ్మలమడుగు పంచాయతీ చేరింది. చంద్రబాబు జమ్మలమడుగు అసెంబ్లీ సీటు ఎవరికి కేటాయిస్తారనే దానిపై గత కొంతకాలంగా అయోమయం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై చర్చించడానికి జమ్మలమడుగు టీడీపీ నేతలు బుధవారం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కడప పార్లమెంట్‌ స్థానంతోపాటు, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు వారితో చర్చలు జరిపారు. మంత్రి ఆదినారయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలో ఒకరిని ఎంపీ స్థానానికి, మరోకరిని అసెంబ్లీ స్థానానికి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

ఇందుకోసం ఈ నెలఖారున జమ్మలమడుగులో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఇరువురు నేతలకు సూచించారు. అయితే ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఇరువులు నేతలు విముఖత చూపుతున్నట్టుగా తెలుస్తోంది. పైకి చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్న ఇరువురు నేతలు.. ఎమ్మెల్యే టికెట్‌ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేపట్టారు. కాగా, గత ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున గెలుపొందిన ఆదినారాయణ రెడ్డిని.. చంద్రబాబు అక్రమంగా పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. 


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు