జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ రద్దు

22 Nov, 2018 03:51 IST|Sakshi
గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌, మెహబూబా ముఫ్తీ

గవర్నర్‌ అనూహ్య నిర్ణయం

అంతకుముందు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్‌ కూటమి

బీజేపీ మద్దతుతో నేనూ సిద్ధమే: పీపుల్స్‌ కాన్ఫెరెన్స్‌ నేత

శ్రీనగర్‌: కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న జమ్మూకశ్మీ ర్‌ రాజకీయాలు బుధవారం ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అసెంబ్లీని రద్దు చేశారు. అంతకుముందు.. కాంగ్రెస్‌ ప్రయత్నాలు ఫలించి, రాష్ట్రంలో బద్ధ శత్రువులైన పీడీపీ, నేషనల్‌ కాన్ఫెరెన్స్‌లు ఒక్కటై, కాంగ్రెస్‌తో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్, ఎన్సీతో కలసి ప్రభుత్వా న్ని ఏర్పాటు చేస్తానంటూ పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ గవర్నర్‌ మాలిక్‌కు లేఖ కూడా రాశారు. మరోవైపు, ఈ కూటమిని అడ్డుకునే లక్ష్యంతో.. బీజేపీ, 18 మంది ఇతరుల మద్దతుతో తాను కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనని పీపుల్స్‌ కాన్ఫెరెన్స్‌ నేత సజ్జాద్‌ లోన్‌ ముందుకు వచ్చారు.

ఈ నేపథ్యంలో అనూహ్యంగా అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు. జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో పీడీపీకి 28, కాంగ్రెస్‌కు 12, ఎన్‌సీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీకి 44 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, ఈ కూటమికి 55 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా, అసెంబ్లీలో బీజేపీకి 25 మంది, పీపుల్స్‌ కాన్ఫెరెన్స్‌కు ఇద్దరు, సీపీఎంకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో పీడీపీ– బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో జూన్‌ 19న రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధించారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉండేందుకు అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచారు.

‘ఇతరుల’ మద్దతుంది
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్, నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ కూడా తమకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని గవర్నర్‌కు రాసిన లేఖలో పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. మరోవైపు, ఇద్దరు ఎమ్మెల్యేల పీపుల్స్‌ కాన్ఫెరెన్స్‌ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. తమకు 25 సభ్యుల బీజేపీతో పాటు 18కి పైగా ఇతర సభ్యుల మద్దతుందని ఆ పార్టీ నేత సజ్జాద్‌ లోన్‌ గవర్నర్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్‌ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం సంచలనం సృష్టించింది.  గవర్నర్‌ నిర్ణయం నిర్ణయం నేపథ్యంలో.. ఎన్నికల ప్రకటనకు ముందే రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని తక్షణమే అమలులోకి తెచ్చే అవకాశంపై యోచిస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు.

బేరసారాలకు అవకాశం
ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగే అవకాశం ఉండటం, విరుద్ధ భావజాలాలున్న పార్టీలు స్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచలేవన్న నమ్మకంతోనే అసెంబ్లీని రద్దుచేయాల్సి వచ్చిందని రాజ్‌భవన్‌ నుంచి ప్రకటన వెలువడింది. మెజారిటీని నిరూపించుకునేందుకు ఒకటి కన్నా ఎక్కువ వర్గాలు ముందుకు రావడం ప్రభుత్వ నిలకడపై ప్రభావం చూపుతుందని మరొక కారణంగా పేర్కొంది.  
మరోవైపు, కాంగ్రెస్‌– పీడీపీ–ఎన్సీ కూటమి వెనుక పాకిస్తాన్‌ హస్తం ఉందని బీజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కవీందర్‌ గుప్తా ఆరోపించారు. దుబాయిలో పాకిస్తాన్‌  ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఈ మూడు పార్టీల నేతలు కలిశారన్నారు.

కలవరపడ్డ బీజేపీ: ముఫ్తీ
కశ్మీర్‌లో మహాకూటమి ఏర్పాటు ఆలోచన బీజేపీని కలవరపాటుకు గురిచేసిందని పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. తన లేఖను స్వీకరించలేకపోయిన గవర్నర్‌ కార్యాలయంలోని ఫ్యాక్స్‌ మిషన్‌ అసెంబ్లీ రద్దు ఉత్తర్వుల్ని మాత్రం వెంటనే జారీచేసిందని ఎద్దేవా చేశారు.  

మరిన్ని వార్తలు