రాష్ట్రపతి పాలనలోకి జమ్మూకశ్మీర్‌

20 Dec, 2018 05:49 IST|Sakshi

న్యూఢిల్లీ: రాజకీయ సందిగ్ధత కారణంగా గత ఆరు నెలలుగా గవర్నర్‌ పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌ తాజాగా రాష్ట్రపతి పాలనలోకి వెళ్లింది. బుధవారం అర్ధరాత్రి నుంచి కశ్మీర్‌ను రాష్ట్రపతిపాలనలోకి తెస్తూ రాష్ట్రపతి కోవింద్‌ అధికార ప్రకటన వెలువరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలని సిఫార్సు చేస్తూ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ నివేదించిన నేపథ్యంలో సోమవారం మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం రాష్ట్రపతిపాలనకు పచ్చజెండా ఊపింది.

జూన్‌లో కశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని అధికార పీడీపీ సర్కారుకు బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో రాజకీయసంక్షోభం మొదలైంది. కాంగ్రెస్, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీల మద్దతు తమకుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలని ఆ తర్వాత గవర్నర్‌ను పీడీపీ కోరింది. అదే సమయంలో బీజేపీ, మరికొందరు ఇతర సభ్యుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని సజ్జద్‌ లోన్‌ నేతృత్వంలోని పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ సైతం గవర్నర్‌ను కలిసింది. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుచేసే సామర్థ్యం రెండు కూటములకు లేవని భావిస్తూ గవర్నర్‌ అసెంబ్లీని రద్దుచేశారు. 

మరిన్ని వార్తలు