కశ్మీర్‌పై అంతా అబద్ధమేనా?

12 Oct, 2019 19:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మూతపడిన దుకాణాలు, స్తంభించిన ప్రజా రవాణాతో ఎవరికి లాభం?’. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులే కొనసాగుతున్నాయంటూ రెండు నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఊదరగొడుతుండగా, అది పచ్చి అబద్ధమని తేల్చేలా స్థానిక ప్రభుత్వం యాడ్స్‌ రూపంలో ఈ వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం పది స్థానిక పత్రికల్లో స్థానిక ప్రభుత్వం ఫుల్‌ పేజీ యాడ్స్‌ను ప్రచురించింది. అంటే ఇంతకాలం కేంద్రం చెబుతున్నదంతా అబద్ధమే గదా!

(చదవండి : జమ్మూకశ్మీర్‌లో మరో కీలక పరిణామం)

‘గత 70 సంవత్సరాలుగా జమ్మూ కశ్మీర్‌ ప్రజలను తప్పు పట్టించారు. విష ప్రచారం వల్ల, దురుద్దేశపూరిత ప్రచారం వల్ల వారు ముగింపు లేని టెర్రరిజమ్‌లో, హింసాకాండలో, దారిద్య్రంలో చిక్కుకున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేశాక, ఆగస్టు ఐదవ తేదీ నుంచి కశ్మీర్‌లో సాధారణ శాంతియుత పరిస్థితులు కొనసాగేందుకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు స్థానిక ప్రభుత్వం కృషి చేశాయి. 

రాళ్లు విసరాల్సిందిగా, హర్తాళ్లు చేయాల్సిందిగా ఇంతకాలం కశ్మీర్‌ వేర్పాటు వాదులు సామాన్య ప్రజలను రెచ్చగొడుతూ వచ్చారు. ఇదే టెర్రరిజమ్‌ బూచీతో వారి పిల్లలను మాత్రం ఇతర సురక్షిత ప్రాంతాల్లో, విదేశాల్లో చదివిస్తున్నారు. ఇప్పుడు మిలిటెంట్లు కూడా ఇదే ఎత్తుగడలకు దిగుతున్నారు’ ఆ వాణిజ్య ప్రకటనల్లో ఆరోపించారు. 

ఈ ప్రకటనల్లోని వాస్తవాస్తవాలపై వివరణ ఇచ్చేందుకు కశ్మీర్‌ నాయకులు ఎవరు అందుబాటులో లేరు. జమ్మూ కశ్మీర్‌ విముక్తి సంఘటన చైర్మన్‌ యాసిన్‌ మాలిక్‌ ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఉన్నారు. సీనియర్‌ హురియత్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు సయ్యద్‌ అలీ షా గిలానీ, అభ్యుదయ హురియత్‌ నాయకుడు మీర్వాయిజ్‌ ఉమర్‌ ఫారూక్‌లు గృహ నిర్బంధంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఇంటర్నెట్‌ సౌకర్యాలను పునరుద్ధరించలేదు. ప్రిపెయిడ్‌ సెల్‌ఫోన్‌ సర్వీసులను పునరుద్ధరించిన టెలికామ్‌ సంస్థలు సోమవారం నుంచి పోస్ట్‌ పెయిడ్‌ మొబైల్‌ ఫోన్‌ సర్వీసులను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. మరి ఆగస్టు 5వ తేదీ నుంచే కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు కొనసాగుతున్నాయనడం అబద్ధం కాదా? నిజంగా కశ్మీర్‌ అభివృద్ధి కోసమే 370ని రద్దు చేశారా ? అదే నిజమైతే ఇలాంటి వాణిజ్య ప్రకటనలు అవసరం లేదు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేస్తారో వివరించే వాణిజ్య ప్రకటనలు అవశ్యం. 

మరిన్ని వార్తలు