15 శాతం బోగస్‌ ఓటర్లు.. ఇంకా ఎన్నికలెందుకు?

10 Nov, 2018 19:13 IST|Sakshi

ఏపీలో లక్షల్లో బోగస్‌ ఓట్లు

అడ్డగోలుగా ఓటర్ల జాబితా

తా తప్పుల తడక

75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 52 లక్షల 67 నకిలీ ఓట్లు

మొత్తం ఓట్లలో నకిలీ ఓట్ల శాతం 15

ప్రజాస్వామ్యానికి ప్రధాన పునాది ఓటర్ల జాబితా. ఆ జాబితా..ఎంత స్పష్టంగా, నిజాయితీగా వుంటే...ప్రజాస్వామ్యం అంత వెల్లివిరుస్తుంది. అయితే ఏపీలో ఆ పరిస్థితి ఏ కోశానా కన్పించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ బోగస్‌ ఓట్లు కుప్పకుప్పలుగా కన్పిస్తున్నాయి. అడుగడుగునా లక్షల్లో బోగస్‌ ఓట్లు దర్శనమిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఓటర్ల జాబితా...అడ్డగోలు వ్యవహారం మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ మధ్యనే విడుదలైన ఏపీ ఓటర్ల జాబితాలో  పెద్దయెత్తున చోటు చేసుకున్న అవకతవకలను జన చైతన్య వేదిక బట్టబయలు చేసింది. అక్రమాలను బయటపెట్టింది. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఓటర్ల జాబితాల్లో అదే పరిస్థితి వుందనే విషయాన్ని లెక్కలతో సహా బయటపెట్టింది.

ఓటర్ల జాబితాలో వివిధ రకాలైన అవతవకలను జనచైతన్య వేదిక గుర్తించింది. ఒక వ్యక్తికి ఒకే ఓటర్‌ కార్డుతో రెండు ఓట్లు కలిగి ఉన్నట్లు గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి మొత్తం 36,404 ఓట్లు ఉన్నట్లు తేలింది. అలాగే ఒక వ్యక్తి.. వేర్వేరు ఓటర్‌ కార్డులతో రెండు ఓట్లు కలిగి ఉన్నాడని, ఇలాంటివి మొత్తంగా 82 వేల788 ఓట్లు ఉండగా.. ఒక వ్యక్తి.. వేర్వేరు వయస్సులతో రెండు ఓట్లు కలిగి ఉన్నట్టుగా కూడా తేలింది. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా 24,928 ఓట్లు ఉన్నట్లు జన చైతన్య వేదిక గుర్తించింది. ఒక వ్యక్తి ఒక ఓటు భర్త పేరుమీద, మరొక ఓటు తండ్రి పేరుమీదా.. రెండేసి ఓట్లు ఉన్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా 92 వేల 198 ఓట్లు ఉన్నాయి. ఇక ఓటరు పేరును తారుమారు చేసిన ఘటనలు సైతం ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఓట్లు 2 లక్షల 60 వేల 634 ఓట్లు ఉన్నాయి. మరో దారుణం కూడా చోటుచేసుకుంది. ఓటరు పేరు, తండ్రి పేరు ఒకేలా ఉండి ఒకే వ్యక్తికి రెండు ఓట్లు కూడా ఉన్నట్లు తేలింది. ఇలాంటివి ఏకంగా 25 లక్షల 17 వేల 164 ఓట్లు ఉన్నట్లు జనచైతన్య వేదిక వెల్లడించింది. ఇంటి నంబర్‌ తప్పుగా ఉన్న ఓట్లు.. 3లక్షల 95 వేల 877 ఉన్నట్లు వెల్లడైంది. అలాగే ఒకే ఓటరు ఐడీతో ఏపీలోనూ, తెలంగాణలోనూ ఓట్లు కలిగి ఉన్నవారు మొత్తం 18 లక్షల 50 వేల 511 మంది ఉన్నట్లు స్పష్టమైంది. ఈ విషయంలో స్థానిక యంత్రాంగం, జన్మభూమి కమిటీలు కలిసి పెద్దయెత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు జన చైతన్య వేదిక ప్రతినిధులు ఆరోపించారు.

ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో 26 వేల నకిలీ ఓట్లు ఉన్నట్లు తేలింది. అయితే ఓ అధికారి కొన్ని ఓట్లను తీయించారు. అయినప్పటికీ అక్కడ ఇంకా 7-8 వేల నకిలీ ఓట్లు ఉన్నాయి. భారీగా బోగస్‌ ఓట్లు ఉన్నట్టు తేలిన నేపథ్యంలో మాజీ సీఎస్‌ అజేయ కల్లం మాట్లాడుతూ..  ఏపీలో గత ఎన్నికల్లో గెలిచిన పార్టీకి, ఓడిన పార్టీకి మధ్య ఓట్ల తేడా కేవలం 2 శాతమేనని గుర్తుచేశారు. అలాంటప్పుడు 15 శాతం నకిలీ ఓటర్లు ఉంటే ఇక ఎన్నికలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. మాజీ సిఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అవతవకలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేనని  అన్నారు.

ముందే చెప్పిన ‘సాక్షి’..
ఏపీ ఓటర్ల జాబితాలో పెద్దయెత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని మొదటినుంచీ ‘సాక్షి’ చెప్తూనే ఉంది. అనేక నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను ఉద్దేశ్యపూర్వకంగానే తొలగించిన వాస్తవాలను కూడా బయటపెట్టింది. వేలమంది నకిలీ ఓటర్లు ఉన్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు