పాపం పెద్దాయన..!

12 Dec, 2018 04:43 IST|Sakshi

పెక్కు శాఖల మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు పొందిన కాంగ్రెస్‌ కురువృద్ధుడు కుందూరు జానారెడ్డి తన సుదీర్ఘ రాజకీయజీవితంలో రెండోసారి ఓడిపోయారు.తాజా ఎన్నికల్లో జానారెడ్డిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య విజయం సాధించారు. 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన వరుసగా 1983, 85, 89 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. 1994లో వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో టీడీపీ అభ్యర్థి గుండెబోయిన రామ్మూర్తియాదవ్‌ చేతిలో 2 వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. తాను ప్రచారం చేయాల్సిన పనిలేదని, ప్రచారం చేయకుండానే గెలుస్తానని చెప్పిన జానా ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు.    
ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం
కొత్తగా ఏర్పడే ప్రభుత్వం సుపరిపాలన అందించాలి. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలి. అవి అమలు కాని పక్షంలో ఆందోళనలు జరిగే ప్రమాదం ఉంది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయన్న విషయాన్ని ఎన్నికల సంఘానికి చెప్పినా పట్టించుకోలేదు. దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నాం. పోలైన ఓట్లకు వీవీ ప్యాట్లలో ఉన్న ఓట్లకు పొంతన లేదు. నా విజయం కోసం పార్టీ కార్యకర్తలు, నేతలు కష్టపడి పనిచేశారు. వారి కష్టాన్ని వృథాగా పోనివ్వను. నమ్మిన వారిని ఆదుకునేందుకు ఎప్పుడూ వెనుకాడబోను. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్నది
నా ఆకాంక్ష. పదవిరానందుకు, గెలవనందుకు బాధ లేదు. నాపై గెలిపొందిన నోముల నర్సింహయ్యకు శుభాకాంక్షలు.    
– జానారెడ్డి

తన జీవితంలో తీరని కోరిక ఒకటి మిగిలిపోయిందని,మీరు సహకరిస్తే అది కూడా పూర్తవుతుందని నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ప్రజలకు జానా గతంలో చెప్పారు. 
సీఎం కావాలన్న ఆయన కోరిక తీరకపోగా, సాగర్‌ ప్రజానీకం ఆయనను ఓటమిపాలు చేయడం గమనార్హం.   
– సాక్షి, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు