పవన్ మాటలు : ఢీలా పడిన కేడర్

28 Mar, 2019 21:50 IST|Sakshi

సాక్షి, అనంతపురం : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జనసేన పార్టీలో ఊపు పెంచాల్సిన అధినేత పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం ఇప్పుడు ఆపార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలకు ముందు రెచ్చిపోయి ఉపన్యాసాలిచ్చిన పవన్ కళ్యాణ్ పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను గందరగోళంలో పడేసే చర్యలకు దిగటం వారిని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. పవన్ వ్యవహారాల శైలిపై ఇప్పటికే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అధికార టీడీపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న విమర్శలు ఒకవైపు ఉండగా, టికెట్ల కేటాయింపులో పార్టీలోని సీనియర్లను సైతం విశ్వాసంలోకి తీసుకోకపోవడం, వారంతా తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నట్టు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపాల్సిన పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా మరింత నిరుత్సాహపరచడం రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేసింది.

ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీకి దిగడం ద్వారా ఆయన గెలుపైన ఆయనకే నమ్మకం లేదనీ, ఆ కారణంగానే రెండుచోట్ల పోటీకి దిగారన్న విమర్శలొచ్చాయి. ఆ రెండు స్థానాల్లోనూ తన సొంత సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నందునే ఆ స్థానాలను ఎంపిక చేసుకున్నారన్న రాజకీయ విమర్శ ఆ పార్టీకి తీవ్ర ప్రతికూల అంశంగా మారింది. ఇలాంటి విషయాలకు దూరం వ్యవహరించాల్సిన పార్టీ అధినేత తన వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యతనివ్వడం పార్టీలోని చాలా మంది నేతలకు రుచించలేదు. తాజాగా, గురువారం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సభలో ఆయన మాట్లాడిన తీరు పార్టీ నాయకులు, కేడర్ ను నివ్వెరపరిచింది. 

 " అనంతపురం నేను పోటీ చేయాల్సిన సీటిది. మీకు వివరణివ్వాలి. జనసేన నాయకులు ప్రతి ఒక్కరికీ చెబుతున్నాను. మీరు నాకు ధైర్యం ఇవ్వలేదు... కనీసం (పార్టీ అభ్యర్థి) డిసి వరుణ్ ను గెలిపించాలి " అని ఎన్నికల బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ అన్న మాటలు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఒక్కసారిగా గందరగోళంలో పడేసింది. గెలిపిస్తామని స్థానిక నేతలు హామీ ఇస్తే తప్ప పవన్ కళ్యాణ్ పోటీ చేయరా? పవన్ కళ్యాణ్ అలా మాట్లాడటం ద్వారా ఇప్పుడు ఆ స్థానంలో పోటీకి దింపిన అభ్యర్థి ఓటమిని అంగీకరించినట్టే కదా? అలాంటప్పుడు పోటీ చేయించడమెందుకు ? అంటూ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నట్టు తెలిసింది. తాను మాత్రం ఎక్కడో ఒకచోట గెలువకపోతానా అని రెండు చోట్ల పోటీ చేసి, ఇతరులు పోటీ చేస్తున్న చోట ఈ రకంగా నిరుత్సాహపరిచడం ఏమాత్రం సమంజసం కాదని అనంతపురం జిల్లాకు చెందిన ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. ఈ రకంగా ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ చర్యలు పార్టీని నమ్మకున్న తమలాంటి నాయకులు, కార్యకర్తలకు తీవ్ర నిరుత్సాహాన్ని నిస్తేజాన్ని కలిగిస్తున్నాయని ఆ నాయకుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు