జనసేన పార్టీలో సం‘కుల’ సమరం

16 Apr, 2018 10:53 IST|Sakshi

రెండు గ్రూపులైన నాయకులు 

అత్యవసరంగా సమావేశమైన సేన 

‘డాక్టర్‌’ పెత్తనంపై యువనేతల ధ్వజం 

‘పవన్‌’ పర్యటనలో తేల్చుకుంటామని ఆగ్రహం 

జిల్లా జనసేనలో సం‘కుల’ సమరం మొదలైంది. పార్టీ వ్యవహారాల్లో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ, మిగతా వర్గాల నాయకులను పార్టీ అధిష్టానం విస్మరిస్తోందన్న విమర్శలు తెరమీదకు వచ్చాయి. పార్టీ సంస్థాగత నిర్మాణానికి కీలకంగా వ్యవహరించే తిరుపతి పట్టణంలో నేతలు రెండు గ్రూపులుగా చీలిపోయారు. ప్రస్తుతం ఎవరికి వారు పార్టీలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. 

సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లా జనసేనలో ఆధిపత్య రగడ మొదలైంది. గుంటూరులో పార్టీ అధినేత ఆత్మగౌరవ సభ పెట్టకు ముందు నుంచే ఈ పోరు కొనసాగుతోంది. రెండు గ్రూపులుగా చీలిపోయిన నాయకులు ఎవరికి వారే యమునాతీరే అన్న చందాన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ పిలుపు మేరకు ఉమ్మడిగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను సైతం వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఒక గ్రూపునకు డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్, రెండో గ్రూపునకు కిరణ్‌రాయల్‌ నేతృత్వం వహిస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌కు ఇద్దరూ సన్నిహితులే అయినప్పటికీ పార్టీ వ్యవహారాల్లో డాక్టర్‌ హరిప్రసాద్‌ ఒకడుగు ముందంజలో ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఆశీస్సుల కారణంగానే ఇంతకు ముందు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కొనసాగిన డాక్టర్‌ హరిప్రసాద్‌ రెండు నెలల నుంచి పార్టీలో కీలక వ్యక్తిగా మారారు. ఇకపోతే తిరుపతి నగరంలో పార్టీని నడిపించడం, ఇతరత్రా కార్యక్రమాల్లో కిరణ్‌రాయల్‌ కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే భారత్‌ బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్టీ పిలుపునిచ్చింది. ఇందుకోసం పార్టీ అధిష్టానం జిల్లాకు చెందిన ఏడుగురు నాయకులను ఆదివారం విజయవాడలో జరిగే సమావేశానికి ఆహ్వానించడంతో పాటు మెంబర్‌షిప్‌ కార్డుల కోసం ఎంపిక చేసింది.

దీంతో ఆహ్వానం లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు రగిలిపోయారు. తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం ఎయిర్‌బైపాస్‌ రోడ్‌లోని ఓ ప్రయివేటు హోటల్‌లో సమావేశమైన పార్టీ నాయకులు కో–ఆర్డినేటర్‌ కిరణ్‌రాయల్, హరిశంకర్‌పై ధ్వజమెత్తారు. ఒకే ఒక సామాజిక వర్గానికి మాత్రమే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం మిగతా వారిని పట్టించుకోకపోవడం ఏమిటని పార్టీ యువనేత బాబ్జీ సమావేశంలో ప్రశ్నించారు. డాక్టర్‌ హరిప్రసాద్‌ తనకు అనుకూలమైన వారినే మెంబర్‌షిప్‌ కోసం ఎంపిక చేయడం ఎంత వరకూ న్యాయమని నిలదీశారు. ఈనెల 22, 23 తేదీల్లో పవన్‌కల్యాణ్‌ తిరుపతి వచ్చినపుడు ఈ విషయంపై తేల్చుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు