సర్కార్‌పై అవిశ్వాసం పెడతాం!

2 Nov, 2017 02:09 IST|Sakshi

ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

అన్నదాతల సమస్యలపై చర్చించకుండా పారిపోయారు

వేలాది మంది రైతు ఆత్మహత్యలకు కేసీఆర్‌ ప్రభుత్వమే కారణం

రైతు రుణాలపై వడ్డీ కడతామని.. తర్వాత వెనక్కు: జానారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రైతాంగ సమస్యల పరిష్కారంపై ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధిలేదని, ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని, దీనికి నిరసనగా సర్కార్‌పై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో ఉన్నామని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి, డిప్యూటీ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలసి ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. శాసన సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ తీరు అత్యంత అప్రజాస్వామికంగా ఉందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, శాసన వ్యవహారాల మంత్రి, వ్యవసాయ మంత్రి గంటలు గంటలు మాట్లాడారని, చివరకు ప్రతిపక్ష నేతకు కనీసం నిరసన తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు.

స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదన్నారు. డిప్యూటీ స్పీకర్‌ ప్రవర్తన పట్ల సీఎల్పీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. సచివాలయంలో అగ్నిమాపక వాహనం తిరగలేదని, శాసన సభలో సీఎం, స్పీకర్‌ వాహనాలు ఎండ లో ఉంటున్నాయని రూ.500 కోట్లు వెచ్చించి కొత్త సచివాలయం, శాసన సభ భవనాలు నిర్మిస్తామని అంటున్నారని మండిపడ్డారు. వాస్తు కారణంగా వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టడానికి అబ్బసొత్తు కాదని, దీన్ని అడ్డుకుని తీరుతామని ఉత్తమ్‌ పేర్కొన్నారు. రుణమాఫీని విడతల వారీగా చేపట్టినందున రైతులపై వడ్డీ భారం పడిందని, వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తామని చెప్పినా.. ఆ హామీని నిలబెట్టుకోవడం లేదన్నారు. రైతులు.. తహసీల్దార్లు, కాంగ్రెస్‌ నేతలు, బ్యాంక్‌ మేనేజర్లకు రుణమాఫీ తర్వాత వడ్డీ భారమెంతో వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధరపై బోనస్‌ ఇవ్వడం లేదని, విద్యుత్‌పైనా సీఎం, మంత్రులు పచ్చి అబద్దాలు మా ట్లాడుతున్నారని విమర్శించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, వ్యవసాయ సంక్షోభానికి, వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్‌ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.  

ప్రతిపక్షాల మాట వినట్లేదు: జానారెడ్డి
ప్రభుత్వం సమస్యలను దాటవేస్తోందని, సీఎం ఉపన్యాసాలు ఇస్తున్నారని, సభ నిబంధనల ప్రకారం నడవడం లేదని సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపక్షాల మాటే వినడం లేదని, రుణ విముక్తి పూర్తిగా గందరగోళ అంశమని చెప్పారు. రుణాలపై వడ్డీలను ప్రభుత్వమే చెల్లిస్తుందని గతంలో అసెంబ్లీ వేదికగా సీఎం హామీ ఇచ్చారని, వడ్డీ రూ.3 వేల నుంచి రూ.4 వేలు అవుతుండడం తో వెనక్కి తగ్గారన్నారు. సభలో నిరసన తెలుపుతామంటున్నా అవకాశం ఇవ్వడం లేదని, అంతా బావుందని రాష్ట్ర ప్రజలను భ్రమిం పజేస్తున్నారని తెలిపారు. సభలో అధికార పక్షం తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు