రోడ్లకూ దిక్కులేని ‘బంగారు తెలంగాణ’

4 May, 2018 02:29 IST|Sakshi

కాంగ్రెస్‌ సేవాదళ్‌ చైర్మన్‌ కనుకుల జనార్దన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తానన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రాష్ట్ర మారుమూల గ్రామాల పట్ల చిత్తశుద్ధి లేదని ఏఐసీసీ సభ్యుడు, కాంగ్రెస్‌ సేవాదళ్‌ చైర్మన్‌ కనుకుల జనార్దన్‌ రెడ్డి ఆరోపించారు. ‘ఊరికి దారేది’ శీర్షికన మే 1న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో ప్రస్తుతమున్న పరిస్థితిని కళ్లకు కట్టేలా చూపిన ఈ కథనంతో ప్రభుత్వ డొల్లతనం అర్థమవుతోందని విమర్శిం చారు.

రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను నిర్మిస్తామని, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు 4 లైన్ల రోడ్లు, మండల కేంద్రాల నుంచి గ్రామాలకు డబుల్‌ లైన్ల రోడ్లు నిర్మిస్తానని ప్రభుత్వం చెప్తున్న మాటలన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలేనని ఎద్దేవా చేశారు. దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నానని చెప్పిన సీఎం కేసీఆర్‌కు ఇప్పటికీ రాష్ట్రంలోని 18,946 గ్రామాలకు మట్టి రోడ్లు ఉన్నాయనే విషయం కనబడటం లేదా అని ప్రశ్నించారు. 358 గ్రామాలకు అసలు రోడ్లే లేవని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు