అవన్నీ మా పథకాలే!

15 May, 2018 01:15 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ ప్రచారంపై సీఎల్పీ నేత జానారెడ్డి ఆగ్రహం

జైపూర్‌ (చెన్నూర్‌): రైతుబంధు పథకాన్ని తాము స్వాగతిస్తున్నామని సీఎల్పీ నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. ఎకరానికి రూ.4 వేలు సరిపోవని, ఇంకా పెంచాలని సూచించారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలో సమన్వయ లోపాన్ని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

అధిష్టాన నిర్ణయం మేరకు అందరూ కలసి పని చేయాల్సిందేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన పథకాలే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేర్లు మార్చి అమలు చేస్తోందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకంతో ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్య సేవలు అందించగా.. అదే పథకాన్ని ప్రధాని మోదీ రూ.5 లక్షలకు పెంచి దేశంలో అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.

తాము ముందు చూపుతో సాగునీటి ప్రాజెక్టులు, జైపూర్, భూపాల్‌పల్లిలో పవర్‌ప్లాంటు నిర్మించగా.. 80 శాతం నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రారంభించి తమ ఘనత అని గొప్పులు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్‌తో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాగా.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లు జానారెడ్డి తెలిపారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ ఏమైందని ఆయన ప్రశ్నించారు.

అసలు కాంగ్రెస్‌ పాలనపై మాట్లాడే అర్హత టీఆర్‌ఎస్‌ నేతలకు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అణచివేత విధానాలు, నిరంకుశత్వ ధోరణి అవలంబిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. ప్రజాసంఘాలకు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదన్నారు. ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఫిరాయింపులను ప్రోత్సహించిందని జానా మండిపడ్డారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ అబద్ధాలు చెప్పడంలో సీఎం కేసీఆర్‌ గిన్నిస్‌రికార్డు సృష్టించారని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు