ద్వారంపూడి నివాసంపై జనసేన దాడి

13 Jan, 2020 04:36 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడి చేస్తున్న జన సైనికులు

కర్రలు, రాళ్లతో దౌర్జన్యం.. వారిని అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

ఇరువర్గాల మధ్య తోపులాట

కాకినాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

కాకినాడ/కాకినాడ సిటీ: వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నివాసంపై ఆదివారం జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. వారి దాడిని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఎదుర్కోవడంతో ఇరు పక్షాల మధ్య తోపులాటలు జరిగాయి. తొలుత పలువురు జనసేన కార్యకర్తలు కర్రలతో, రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఉదయం 10 గంటల నుంచి మూడు గంటల పాటు కాకినాడ నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన కార్యకర్తల దాడిలో పలువురు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. మూడు రాజధానులకు మద్దతుగా శనివారం కాకినాడలో జరిగిన సంఘీభావ ర్యాలీలో పవన్‌ కళ్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన పార్టీ ఎమ్మెల్యే నివాసం ముట్టడికి పిలుపునిచ్చింది.

మొదట జనసేన కార్యకర్తలు కాకినాడ భానుగుడి సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించారు. ఇక్కడ నిరసనకు అనుమతి లేదంటూ పోలీసులు నివారించే ప్రయత్నం చేయగా వారిని లెక్క చేయకుండా గొడారిగుంట భాస్కర్‌నగర్‌లోని ఎమ్మెల్యే నివాసం వైపు మళ్లారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే నివాసానికి చేరుకోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటు భానుగుడి సెంటర్, ఇటు ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు మోహరించారు. ఈ ఘటనలపై జనసేన, వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు.  

తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదు..
జనసేన వ్యవహారశైలిపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే కాకినాడలో అల్లరి మూకలను రెచ్చగొట్టి దాడికి పురిగొల్పిన తీరు అత్యంత హేయమన్నారు. పవన్‌ మొదటి నుంచి చంద్రబాబుకు వంతపాడుతున్నారన్న వాస్తవాన్ని జనసేన కార్యకర్తలు గుర్తించాలన్నారు. రాజకీయంగా పవన్‌ వ్యవహారశైలిని విమర్శిస్తే.. దానికి కులం రంగు పులిమి వివాదాలు సృష్టిస్తే సహించబోమని, తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదని స్పష్టం చేశారు. కాగా, జనసేన కార్యకర్తల దాడి ప్రయత్నాన్ని తెలుసుకున్న మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి నివాసానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

జీజీహెచ్‌లో జనసేన కార్యకర్తల బీభత్సం 
కాకినాడ జీజీహెచ్‌లో జనసేన నాయకులు, కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. వీరి దాడిలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, ఇద్దరు నర్సులు, ఓ మహిళా రిపోర్టర్‌ గాయపడ్డారు. ద్వారంపూడి ఇంటి వద్ద జనసేన కార్యకర్తల దాడిలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు జీజీహెచ్‌లో చికిత్స కోసం వచ్చారు. అక్కడ చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జనసేన నేతలు దాడికి దిగారు. 

మరిన్ని వార్తలు