తెరవెనుక టీడీపీ, జనసేన మంతనాలు

10 Mar, 2020 13:40 IST|Sakshi

స్థానిక ఎన్నికల్లో పొత్తుకు ఎత్తులు

పరువు కాపాడుకోడానికి ఇరు పార్టీల తంటాలు

పశ్చిమగోదావరి,భీమవరం: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకోవడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ధాటికి తట్టుకోలేక తెలుగుదేశం, జనసేన పార్టీలు అనైతిక పొత్తుకు అర్రులు చాస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని మూటకట్టుకున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు జిల్లాలో దాదాపు ఉనికి కోల్పోయాయి. ఇక జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎమ్మెల్యేగా పోటీచేసిన భీమవరం నియోజకవర్గంలో ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, జనసేన పార్టీలు పొత్తుపెట్టుకోగా ఇరుపార్టీలు అవగాహనతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించాయి. అయితే జిల్లాలో మాత్రం తమ ఉనికి కాపాడుకోడానికి టీడీపీ, జనసేనలు తెరవెనుక మంతనాలు చేపట్టాయి. 

కేడర్‌ లేక ఇరుపార్టీలు సతమతం
జిల్లా వ్యాప్తంగా స్థానికసంస్థల ఎన్నికల్లో టీడీపీ స్వతంత్రంగా పోటీ చేసే సత్తా కోల్పోయింది. అనేక నియోజకవర్గాల్లో కనీసం పార్టీ కేడర్‌ సైతం లేకపోవడంతో అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. అంతేగాకుండా పోటీ చేసినా ఏం చెప్పి ఓటర్ల వద్దకు వెళ్లాలని పార్టీ కేడర్‌ మదనపడుతోంది. పార్టీ అధిష్టానం పోటీ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితిలో లోపాయికారిగా జనసేనతో పొత్తుపెట్టుకుని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఎలాగు గెలిచే అవకాశాలు లేనందున కనీసం పార్టీ ఉనికిని కాపాడుకోడానికైనా ఎన్నికల్లో అభ్యర్థులను పోటీ పెట్టాలని భావిస్తున్నారు.

బీజేపీతో జనసేన పార్టీ బహిరంగ పొత్తు పెట్టుకున్నా.. తెరవెనుక టీడీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే కొన్నిచోట్ల ఒప్పందాలు చేసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధానంగా డెల్టా ప్రాంతంలోని భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అభ్యర్థుల ఎంపికకు టీడీపీ, జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది. అయితే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవని.. అంతేగాకుండా భవిష్యత్తులో కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని నాయకులు పోటీకి వెనుకంజ వేస్తున్నట్లు ఆ పార్టీల నేతలే బహిరంగంగా చెబుతున్నారు. గెలుపుపై ఆశలు లేకున్నా కనీసం పార్టీ పరువు నిలపడానికైనా అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో టీడీపీ, జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపిక కష్టమేనని ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు