ప్రభుత్వాన్ని విమర్శించేందుకు రాలేదు

10 Dec, 2017 02:00 IST|Sakshi

 జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్య

బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పరామర్శ

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘నేను ప్రభుత్వంపైన, మంత్రులు, ఎమ్మెల్యేలపైన మాటలతో దాడి చేయడానికి రాలేదు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరు సున్నిత తత్వం మరిచిపోతున్నంత కాలం ఇటువంటి కన్నీళ్లే మిగులుతాయి.’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.  నవంబర్‌ 12న విజయవాడ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుం బాలను శనివారం ఉదయం ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎన్‌టీఆర్‌ కళాక్షేత్రంలో పరామర్శించారు. టూరిజం శాఖ లైఫ్‌ జాకెట్లుకోసం రూ.5 లక్షలు వెచ్చించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు.

కానీ నేడు ఆ నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వ ఖజానాపై రూ.కోట్ల భారం’ అని పవన్‌ పేర్కొన్నారు. ‘ప్రధానిగా ఉన్నపుడు లాల్‌బహదూర్‌ శాస్త్రి రైలు ప్రమాదంలో ఇద్దరు మరణిస్తే  రాజీనామా చేశారు. ఆయనలా అఖిల ప్రియను రాజీనామా చేయమని కోరడంలేదు. కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించాలి.’ అని పవన్‌ వ్యాఖ్యానించారు. ‘టీడీపీ, బీజేపీలకు మద్దతిస్తున్న మీరు బోటు ప్రమాద బాధితులను ఎందుకు పరామర్శించలేదని లండన్‌లో ఓ కుర్రాడు ప్రశ్నిస్తే నా బాధ్యత నాకు గుర్తుకు వచ్చింది’ అని ఆయన పేర్కొన్నారు.

‘బాసర ఫీజుల’పై కేసీఆర్‌ను అడగొచ్చుగా..
‘తెలంగాణ ప్రభుత్వం బాసరలో ఆంధ్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు.. మరి ఆంధ్రా మంత్రులు, టీఆర్‌ఎస్‌ మంత్రుల పెళ్లిళ్లకు వెళ్తారు. వ్యాపారాలు చేస్తారు. ఎవరో మంత్రి అల్లుడికి కాంట్రాక్టులు ఉన్నాయి. ఇవన్నీ నేను చెబుతున్న మాటలు కాదు... రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు. ఇంత మంచి సంబంధాలున్నప్పుడు టీఆర్‌ఎస్‌ సీఎం చంద్రశేఖర్‌రావును, మంత్రులను బాసర విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయం అడగలేరా..’ అని పవన్‌ టీడీపీ మంత్రులను ప్రశ్నించారు. శనివారం ఒంగోలు ఏ–1 కన్వెన్షన్‌ సెంటర్లో జరిగిన ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

మరిన్ని వార్తలు