ప్రత్యేక హోదాపై మాట మార్చిన పవన్‌ కల్యాణ్‌

16 Jan, 2020 16:27 IST|Sakshi

వామపక్షాలకు పవన్‌ కల్యాణ్‌ ఝలక్‌

బీజేపీ కలిసి పోటీ చేస్తామని  ప్రకటన

సాక్షి, విజయవాడ:  జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ఏపీకి ప్రత్యేక హోదాపై మాట మార్చారు. హోదా కోసం తాను చేయాల్సింది చేశానని ఆయన చెప్పుకొచ్చారు మొన్నటి ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసిన పవన్‌ కళ్యాణ్‌... ఇప్పుడు బీజేపీ పంచన చేరి కామ్రేడ్లకు గట్టి ఝలక్‌ ఇచ్చారు. పాచిపోయిన లడ్డులు ఇచ్చిందని హోదాపై కేంద్రంపై విమర్శలు చేసిన పవన్‌  ఇప్పుడు కాషాయ కండువాతో జత కట్టారు. మరోవైపు ఆనాడు తెలుగుదేశం పార్టీ  ప్రత్యేక ప్యాకేజీ అంగీకరించడం వల్లే సమస్య వచ్చిందని పవన్‌ వ్యాఖ్యలు చేశారు. 

జనసేన, బీజేపీ ముఖ్యనేతలు గురువారం విజయవాడలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ తరపున ఇన్‌చార్జ్‌ సునీల్‌ దియోధర్, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు,  జనసేన తరపున  పవన్‌కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. (చదవండిబీజేపీ, జనసేన కీలక భేటీ : విలీనమా? పొత్తా?)

ఈ భేటీ అనంతరం పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు.  ‘వామపక్ష పార్టీలకు నేను ఏమైనా బాకీ ఉన్నానా? ఆ పార్టీలకు నేనేమీ చెబుతాను. వామపక్ష పార్టీలతో కలవక ముందే బీజేపీ కోసం పని చేసాను. ఏపీ భవిష్యత్‌ కోసం బీజేపీతో కలిసి ముందుకు వెళతాం. ఇక అమరావతిపై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది.’ అని అన్నారు. కాగా అమరావతిపై ప్రభుత్వం ఎలా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని మీడియా ప్రతినిధుల ప్రశ్నించగా... ఆ ప్రశ్నకు పవన్‌ కల్యాణ్‌ సమాధానం దాటవేశారు. ఇక పవన్‌ వైఖరిపై వామపక్ష నేతలు మండిపడుతున్నారు.

కాగా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే జీఎన్‌ రావు, బోస్టన్‌ గ్రూప్‌ కమిటీలను వేసింది. అంతేకాకుండా ఈ రెండు కమిటీలు ఇచ్చిన సిఫార్సులు, నివేదికలపై మంత్రులతో కూడిన హై పవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈనెల 20న ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఉదయం 9..30 గంటలకు సమాశమయ్యే మంత్రివర్గం హైపవర్‌ కమిటీ నివేదికపై చర్చించనుంది. అనంతరం ఉదయం 11 గంటలకు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం జరగనుంది. 

అలాగే, 21వ తేదీ ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశం జరుగుతుంది. పరిస్థితులను బట్టి శాసనసభ మరో రోజు అదనంగా 21న కూడా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. హైపవర్‌ కమిటీ కూడా తన నివేదికను సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ చేపట్టనున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు