ఎలా పవనూ ఎలా...?

7 Apr, 2019 13:44 IST|Sakshi

2009లో చంద్రబాబు మోసగాడు నమ్మొద్దు.. 

2014లో చంద్రబాబుకే ఓటేయండి.. నాది పూచీ..

2014లో తెలంగాణ వాళ్లు మంచోళ్లు.. అక్కడ ఎందుకు పుట్టలేదా అని బాధపడ్డాను..

2019లో నాకే ఓటేయండి... 

2019లో తెలంగాణ వాళ్లు ఆంధ్రావారిని కొడుతున్నారు..

 జాతీయ పార్టీలకు గులాంగిరీ చేయకండి.. బానిసత్వంతో నడుం వంగిపోయాలా మోకాళ్ల దండాలు పెట్టకండి.. రాష్ట్ర ప్రజల మనోభవాలను, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి..సముద్రం ఒకరి కాళ్ళ వద్ద కూర్చుని మొరగదు..  తుపాను గొంతు చిత్తం అనడం ఎరుగదు..  పర్వతం ఎవరికీ వంగి సలాం చేయదు..ఆత్మగౌరవం ఉన్న ఏ తెలుగోడూ జీ హుజూర్‌.. జీహూజూర్‌... అని గులాంగిరీ చేయడు.. కట్‌ చేస్తే.. అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు అభిశంసించిన ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం మాయావతి కాళ్లకు మొక్కడం..ఒక్కసారి కాదు.. ఎయిర్‌పోర్ట్‌లో కారు ఎక్కేటప్పుడు.. కారు దిగిన తర్వాత.. బహిరంగసభలు పెట్టిన ప్రతిచోటా వంగివంగి దండాలు పెట్టడం.. 

ఈ ట్రాక్‌ రికార్డంతా ఎవరి గురించో మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గురించే.. ఆయన నిలకడ లేని మనస్తత్వం.. రెండుమూడేళ్ళకు మారిపోయే మాటల సంగతి ప్రస్తావిస్తే.. ఇప్పుడు చాంతాడంత అవుతుంది. ఇప్పుడిదంతా ఎందుకంటే చివరికి ఆయన పోటీ చేస్తున్న గాజువాక నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా అంతే గందరగోళంగా ఉన్నాయి. ఏమాత్రం పొంతన  లేకుండా.. స్థానిక సమస్యలపై కనీస అవగాహన లేకుండా ఇచ్చిన, ఇస్తున్న హామీలు చూసి గాజువాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. గాజువాక ప్రజకే 2 లక్షల ఉద్యోగాలు ఎలా వచ్చేస్తాయి.  అలాగైతే ఎన్ని కంపెనీలు పెట్టాలి. అగనంపూడి రెవిన్యూ డివిజన్‌ ఎలా సాధ్యం. అభాసుపాలవుతున్న అజ్ఞాతవాసి హామీలు . ఆ ప్రాంత సమస్యలపై అవగాహన లేకుండా  సినిమాలు డైలాగుల మాదిరి హామీలు.  ఆ హామీల సంగతి ఏమిటో చూద్దాం రండి.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నాకు కొద్దిగా తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది.. గబ్బర్‌ సింగ్‌ సినిమాలోని ఈ డైలాగ్‌..  ఇప్పటికీ పవన్‌ కల్యాణ్‌ అభిమానుల్లో నానుతూనే ఉంటుంది. ఇప్పుడు గాజువాకలో ఆయన ఇచ్చిన హామీలు చూస్తే సరిగ్గా ఆ డైలాగ్‌ను తిప్పి చదువుకోవాల్సిందే. ఏమాత్రం లెక్క లేకుండా... నియోజకవర్గ సమస్యలపై కనీస అవగాహన లేకుండా ఆయనిచ్చిన హామీలు నవ్వులు పూయిస్తున్నాయి. వెండితెరపై డైలాగులతో ఈలులు వేయించిన పవన్‌కల్యాణ్‌.. రాజకీయ తెరపై మాత్రం కామెడీని పండిస్తున్నారనే విమర్శలకు ఆయన గాజువాకకు ఇచ్చిన హామీలు ఊతమిస్తాయి.

గాజువాకకు సంబంధించి ఆయన ఇప్పటికే లెక్కలేనన్ని.. మళ్ళీ గట్టిగా ఆయన్ను అడిగినా కూడా చెప్పలేనన్ని వాగ్దానాలు చేసేశారు. వాటన్నిటి గురించి వదిలేసి ఒకటి రెండు ప్రధానమైన వాగ్దానాలనే తీసుకుందాం.  గాజువాక ప్రజలకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పవన్‌ పదే పదే చెప్పుకొస్తున్నారు. గాజువాకలోని పరిశ్రమల్లో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటే.. కనీసం దానికైనా అర్ధం ఉంటుంది. కానీ ఏకంగా 2 లక్షలమంది గాజువాక ప్రజలకే ఉద్యోగాలు ఇచ్చేస్తానని పవన్‌ ఊదరగొట్టేస్తున్నారు. అసలు.. ఇది ఎలా సాధ్యమన్న ప్రశ్నే ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. గాజువాకలో ఓటర్లు మూడు లక్షలు కాగా.. జనాభా మొత్తంగా మూడున్నర లక్షలమంది. ఇందులో ఇప్పటికే ఉద్యోగుల సంఖ్య .. సంఘటిత, అసంఘటిత రంగాలను కలిపితే లక్షన్నర మందికిపైగానే ఉంది. మిగిలిన వారిలో వృద్ధులు, పిల్లలు, గృహిణులు ఉంటారు.  
 

మరి ఈ లెక్కన గాజువాకలో రెండులక్షల ఉద్యోగాలు ఎవరికిస్తారు.. అది ఎలా సాధ్యం అన్న ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవంగా లెక్క వేస్తే రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ స్టీల్‌ప్లాంట్‌లోనే 11వేలమంది పర్మినెంట్‌ ఉద్యోగులుండగా, 15వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు.  ఈ లెక్కన పవన్‌ చెబుతున్న 2లక్షల ఉద్యోగాలు రావాలంటే స్టీల్‌ప్లాంట్‌ వంటి పరిశ్రమలు ఎన్ని పెట్టాలో.. వాటికి ఎన్నేళ్లు పడుతుందోనన్న వాదనలు బయలుదేరాయి. సొంత గనులు, నీటి సరఫరా వంటి సమస్యలతో స్టీల్‌ప్లాంట్‌ ఉనికే ప్రశ్నార్ధకమైన పరిస్థితుల్లో ఏనాడూ ఆ సమస్యలపై స్పందించకుండా.. ప్రస్తుత పరిశ్రమల్లో ఉన్న సమస్యలపై కనీస అవగాహన లేకుండా.. రెండులక్షల ఉద్యోగాలు తెచ్చేస్తాను.. అన్న పవన్‌ ప్రకటనపై ఉద్యోగసంఘ నేతల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అగనంపూడి రెవెన్యూ డివిజన్‌ ఎలా సాధ్యం
పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన మరో అంశం.. అగనంపూడి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తానన్న హామీ. రెవెన్యూ డివిజన్‌ అంటే పది నుంచి పదిహేను మండలాలకు కేంద్రంగా అందుబాటులో ఉండే పెద్ద ప్రాంతాన్ని ఆ మండలాలకు పరిపాలన కేంద్రంగా ఉంటుంది. అగనంపూడి పరంగా చూసుకుంటే.. ఈ ప్రాంతం విశాఖ రెవెన్యూ డివిజన్‌లో ఉంది. పైగా ఇదంతా మహావిశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ)లో అంతర్భాగం. దీనికి తోడు సమీపంలో పరిపాలనపరంగా ఇబ్బంది పడుతున్న మండలాలు కూడా లేవు. ఆ పక్కన చూస్తే.. 20 కి.మీ. దూరంలోనే అనకాపల్లి డివిజన్‌ కేంద్రం ఉంది. ఈ రెండింటి మధ్యలోనూ మండలాలు లేవు. అలాంటప్పుడు అగనంపూడి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయడం ఎలా సాధ్యం?.. పోనీ దీనికి సంబంధి ప్రతిపాదనలు గానీ.. ప్రజల నుంచి డిమాండ్లు గానీ ఉన్నాయా.. అంటే అవీ లేవు. మరి ఏం ఆలోచించి తలాతోకా లేని అగనంపూడి రెవెన్యూ డివిజన్‌ అంశాన్ని పవన్‌ తన ప్రణాళికలో ఎలా చేర్చేశారో?.. ఇందులో ఆయన లెక్కేమిటో??.. ఆయనకే తెలియాలి.   

మరిన్ని వార్తలు