136 స్థానాల్లో పోటీచేస్తే 120 చోట్ల డిపాజిట్లు గల్లంతు

25 May, 2019 04:40 IST|Sakshi

ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న జనసేన 

పీఆర్పీ గెలిచిన స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు 

నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన స్థానాలూ అధికమే 

గెలిచింది ఒక్కచోటే.. మూడుచోట్ల రెండో స్థానంలో.. 

సాక్షి, అమరావతి: గత నెల 11న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ రాష్ట్రంలోని 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయగా అందులో 120 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఫలితాలను చూసి పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌తో పాటు ఆ పార్టీ నేతలు సైతం అవాక్కయ్యారు. రాష్ట్రం మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.13 కోట్ల ఓట్లు పోలైతే, జనసేన పార్టీకి దక్కిన ఓట్లు కేవలం 21 లక్షలు మాత్రమే. ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పార్టీ పోటీచేసిన చాలా నియోజకవర్గాల్లో జనసేనకు దక్కిన ఓట్ల కంటే నోటాకు వచ్చిన ఓట్లే అధికంగా ఉన్నాయి.

ఉభయ గోదావరి జిల్లాల తర్వాత పవన్‌ ఎక్కువ ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో.. పార్టీకి కంటే నోటాకు ఎక్కువ వచ్చిన ఓట్లు ఆరు దాకా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలతో పాటు విజయనగరం జిల్లాలోని సాలూరు, గజపతి నగరం నియోజకవర్గాలు, విశాఖ జిల్లాలోని మాడుగుల, పాడేరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎదురైంది. పాడేరులో జనసేన పార్టీ కంటే స్వతంత్ర అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి.  

ప్రజారాజ్యానికే ఎక్కువ సీట్లు: 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ విశాఖ జిల్లా పెందుర్తి, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో గెలుపొందగా.. 2019 ఎన్నికల్లో పోటీచేసిన జనసేన ఇక్కడ కనీసం డిపాజిట్లు దక్కించుకోకపోవడం గమనార్హం. అలాగే, ప్రజారాజ్యం పార్టీ 13 జిల్లాల్లోని 16 నియోజకవర్గాల్లో గెలిచి, మరో 34 నియోజకవర్గాల్లో రెండో స్థానం దక్కించుకోగా.. జనసేన తూర్పు గోదావరి జిల్లాలోని ఒక్క రాజోలులో గెలుపొందగా కేవలం మూడంటే మూడు చోట్లే రెండో స్థానంలో నిలిచింది. అవి గాజువాక, భీమవరంతో పాటు నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు. 

ఫలితాలపై జూన్‌లో జనసేన విశ్లేషణ: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకునేందుకు జూన్‌ మొదటి వారంలో పార్టీ అభ్యర్థులతో విజయవాడలో సమావేశాలు నిర్వహించాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ నాయకులు తమ పరిశీలనకు వచ్చిన అంశాలను, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పవన్‌ కల్యాణ్‌కు వివరించారు.

మరిన్ని వార్తలు