టీడీపీ నేతలను తరిమి కొడతాం: పవన్‌కల్యాణ్‌

5 Jul, 2018 08:47 IST|Sakshi
జనసేన పోరాటయాత్రలో మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్‌

పెందుర్తిని ఎమ్మెల్యే, అతని కొడుకు దోచుకుంటున్నారు

రైల్వేజోన్‌పై టీడీపీ ఎంపీలది కపట దీక్ష

పెందుర్తి ప్రజాపోరాట యాత్రలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

పెందుర్తి: విశాఖ జిల్లాలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ నాయకులను తరిమికొట్టాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. పెందుర్తిని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అండతో అతడి కుమారుడు అప్పలనాయుడు దోపిడీ చేస్తున్నాడని.. అడిగిన వారిని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన పదవులు ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలకు దోచుకోవడానికి లైసెన్సులు కాదన్నారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా పెందుర్తిలో పర్యటించిన పవన్‌కల్యాణ్‌ ముదపాక భూములను సందర్శించారు. అనంతరం ముదపాకలోనూ, పెందుర్తి నాలుగు రోడ్ల కూడలి వద్ద జరిగిన సభల్లో ప్రసంగిస్తూ టీడీపీ పాలనను ఎండగట్టారు. ప్రజాసమస్యలు పట్టని టీడీపీకి మళ్లీ అధికారమిస్తే ఉత్తరాంధ్రను సమూలంగా అమ్మేస్తారని ధ్వజమెత్తారు.

కాలుష్యం నిండిన పరిశ్రమలను ఇక్కడపెట్టి కనీసం గాలి కూడా పీల్చుకోనీయకుండా చేసేస్తారని అన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుమారుడు దోపిడీలకు పాల్పడుతూ తనకు అడ్డుచెప్పిన వారిని భయబ్రాంతులకు గురి చేసి వేధింపులకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే, అతడి కుమారుడు తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ముదపాక భూముల దోపిడీ వ్యవహారంలో వీరికి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. తాడి గ్రామం తరలింపులో జాప్యం, హిందుజా, ఎన్టీపీసీ తదితర కంపెనీల్లో అక్రమ నియామకాల్లో వీరి పాత్ర ఉందని ఆరోపించారు. పరవాడ ప్రాంతంలోని ఫార్మా, ఇతర కంపెనీల్లో స్థానికులకు/అర్హులకు కాకుండా టీడీపీ నాయకులు సిఫార్సు చేస్తున్న వారికే ఉపాధి లభించడం ఏంటని ప్రశ్నించారు.

సింహాచలం భూ సమస్య పరిష్కారంలో ఎమ్మెల్యే ఈ నాలుగేళ్లలో చూపిన చొరవ ఏంటో ప్రజలకు తెలియజేయాలని అడిగారు. లంకెలపాలెం అండర్‌పాత్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం నాలుగేళ్లగా చొరవ చూపని ఎంపీ అవంతి శ్రీనివాస్‌ రైల్వేజోన్‌ కోసం దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లాలో టీడీపీ నాయకులు ప్రజలకు మంచి చేస్తారని తాను గత ఎన్నికల్లో మద్దతు ఇస్తే వారంతా ఏకమై జనాన్ని పీడించుకుతింటున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ వారికి తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.

తాను పదవులకు ఆశించే వ్యక్తిని కాదని ప్రజాసమస్యల గురించి పోరాటం చేసేందుకే పార్టీని స్థాపించానని వివరించారు. పెందుర్తిలో తన పర్యటన అడ్డుకునేందుకు టీడీపీ చేసిన కుట్రలు సిగ్గుచేటని.. అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీయించిన టీడీపీ నాయకుల తీరు వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. టీడీపీ నాయకులు ప్రజల జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు. పవన్‌కల్యాణ్‌ ప్రసంగం ముగింపు సమయంలో ‘తాటిచెట్టు ఎక్కలేవు.. తాటి కల్లు తీయలేవు’ పాటతో అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ముదపాకలో భూ బాధితులతో జరగాల్సిన ముఖాముఖి కార్యక్రమం అభిమానుల కారణంగా రసాబాసగా మారడంతో  గందరగోళం మధ్యలో పవన్‌ కాసేపు ప్రసంగించి ముగించేశారు.

     

మరిన్ని వార్తలు