175 స్థానాల్లో పోటీ: పవన్‌

2 May, 2018 04:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు జనసేన సర్వసన్నద్ధంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ ప్రకటించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన పార్టీ ముఖ్య కార్యకర్తలతో మంగళవారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికలకు పార్టీని బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసేందుకు ముఖ్య రాజకీయ వ్యూహకర్తగా దేవ్‌ పనిచేస్తారని పవన్‌ చెబుతూ ఆయన్ను పార్టీ నేతలకు పరిచయం చేశారు.

వచ్చే ఎన్నికల తర్వాత కూడా దేవ్‌ సేవల్ని పార్టీ వినియోగించుకుంటుందన్నారు. తాను గతంలో ఏర్పాటు చేసిన కామన్‌మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(సీపీఎఫ్‌)లోని 1,200 మంది కార్యకర్తలతోపాటు దేవ్‌ టీంలో 350 మంది ఎన్నికలకోసం పనిచేస్తారన్నారు. ‘‘గత ఎన్నికల్లోనే 70 నుంచి 80 అసెంబ్లీ స్థానాల్లో, 8 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేయాలనుకున్నా. అప్పటి పరిస్థితుల్లో ఎన్డీయేకు సహకరించాం. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసేముందు క్షేత్రస్థాయి పరిస్థితులు, సమస్యలు, ప్రజల ఇబ్బందులపై అవగాహన అవసరమన్నది నా ఉద్దేశం. అవేవీ లేకుండా పోటీ చేసి గెలిస్తే, ఎప్పటికీ నేర్చుకొనే అవకాశముండదు’’అని పవన్‌ చెప్పారు.

జనసేన కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తానెప్పుడూ చెప్పలేదన్నారు. కులాలమధ్య ఐక్యత అన్నదే జనసేన తొలి సిద్ధాంతమన్నారు. ‘‘జనసేన ఏ ఒక్క కులానికో ప్రాతినిధ్యం వహించదు. కులం అనే భావనే ఉంటే గత ఎన్నికల్లో టీడీపీకి ఎలా సహకరిస్తాం? కులాలకు అతీతంగా ఆలోచన చేద్దాం’’అని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ ఎన్నికల ప్రాథమిక వ్యూహాన్ని ఆగస్టు రెండోవారంలో వెల్లడిస్తానన్నారు.

మరిన్ని వార్తలు