బాబుతో ప్రతాప్‌ కలిసి పనిచేశారు : జంగా

29 Jan, 2020 15:51 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: రిజర్వేషన్ల ముసుగులో టీడీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శించారు. టీడీపీ నేతలు ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసిన ప్రతాప్‌ టీడీపీకి చెందిన వ్యక్తి అని అన్నారు. ప్రతాప్‌ టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌కు దగ్గరి వ్యక్తి అని.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో అనేక సందర్భాల్లో కలిసి పనిచేశారని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే బీసీల సంక్షేమంపై దృష్టి పెట్టారని చెప్పారు.

బీసీలను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు. బీసీ వర్గాల మీద చంద్రబాబుకు ప్రేమ ఉంటే ప్రతాప్‌రెడ్డి వేసిన పిల్‌ ఉపసంహరింప చేయాలని సవాలు విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లో ప్రైవేటు చర్చ పెట్టారని గుర్తుచేశారు. చంద్రబాబు నిజస్వరూపం గమనించే టీడీపీకి బీసీలు దూరమయ్యారని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ బీసీలకు అన్ని విధాల న్యాయం చేశారని తెలిపారు. 

మరిన్ని వార్తలు