బీజేపీలో చేరిన జయప్రద

27 Mar, 2019 03:33 IST|Sakshi
ఢిల్లీలో బీజేపీ సభ్యత్వం స్వీకరిస్తున్న జయప్రద

సాక్షి, న్యూఢిల్లీ: సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ సీనియర్‌ నేత ఉపేంద్ర యాదవ్‌ ఆమెను పార్టీలోకి ఆహ్వానించి ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ.. బీజేపీలో చేరడం తన జీవితంలోనే ప్రధానమైన ఘట్టం అని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నప్పుడు జయప్రద ఆ పార్టీ సీనియర్‌ నేత అమర్‌సింగ్‌ శిష్యురాలిగా ఉన్నారు. అనంతరం పార్టీ పగ్గాలు అఖిలేష్‌ యాదవ్‌ చేతికి అందడం, సొంతపార్టీకి చెందిన సీనియర్‌ నేత ఆజంఖాన్‌ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం వంటి కారణాల వల్ల కొంత కాలంగా ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

రాంపూర్‌ నుంచే బరిలోకి..
తెలుగుదేశం పార్టీ నుంచి 1994లో రాజకీయ అరంగేట్రం చేసిన జయప్రద.. రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్‌ అయ్యారు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2004, 2009 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈసారి కూడా ఆమె అదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలో దిగనున్నారు. ఈ ఎన్నికల్లో ఎస్పీ తరఫున రాంపూర్‌ నుంచి ఆజంఖాన్‌ పోటీలో ఉండటం గమనార్హం. గతంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక గతంలో ఒకే పార్టీకి చెందిన ఈ ఇద్దరు.. ఇప్పుడు  ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.
 

మరిన్ని వార్తలు