మహిళల ఓట్లు నాకే

19 Apr, 2019 04:11 IST|Sakshi

ఆజంఖాన్‌ వ్యాఖ్యలపై అఖిలేశ్‌ స్పందించలేదు

దీంతో మహిళలు ఎస్పీకి దూరమయ్యారు

ఇప్పుడు పోటీలో ఉన్నది నేను కాదు, ప్రజలే: జయప్రద

రాంపూర్‌: సమాజ్‌వాదీ పార్టీ ముఖ్య నేత ఆజంఖాన్‌ ఇటీవల తనపై చేసిన అసభ్యకర ‘ఖాకీ నిక్కర్‌’ వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ స్పందించకపోవడాన్ని జయప్రద ఓ ఇంటర్వ్యూలో తప్పుబట్టారు. ఈ అంశంలో అఖిలేశ్‌ మౌనం వహించడంతో ఇప్పుడు మహిళలు ఆ పార్టీకి దూరం అయ్యారనీ, ఇక స్త్రీలంతా తనకే ఓటు వేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాంపూర్‌లో ఎస్పీ తరఫున ఆజంఖాన్, బీజేపీ తరఫున జయప్రద పోటీ చేస్తుండటం తెలిసిందే. అఖిలేశ్‌ సమక్షంలోనే ఆజం ఖాన్‌ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నా అఖిలేశ్‌ ఏమీ అనలేదనీ, కాబట్టి ఆయన మనస్తత్వం కూడా ఆజంఖాన్‌ లాంటిదేనని ఆమె ఆరోపించారు.

ఎన్నికల్లో ఓడిపోతాననే అభద్రతా భావంతోనే ఆజంఖాన్‌ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసి ఉంటాడని జయప్రద పేర్కొన్నారు. ఆంజఖాన్‌ వ్యాఖ్యలు చేయడం చిన్న అంశమంటూ అఖిలేశ్‌ భార్య డింపుల్‌ అనడం పట్ల జయప్రద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో దేశం మొత్తం తనవైపు ఉంటే డింపుల్, జయా బచ్చన్, షబానా అజ్మీలు మాత్రమే తనకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేసినందుకు ఆజంఖాన్‌ ప్రచారం చేయకుండా 72 గంటలపాటు నిషేధించిన ఎన్నికల సంఘానికి, అలాగే ఈ అంశంపై స్పందించి ఆజంఖాన్‌కు నోటీసులు పంపిన జాతీయ మహిళా కమిషన్‌కు జయప్రద ధన్యవాదాలు తెలిపారు.

అన్నా అని పిలిచి తప్పు చేశా..
ఆజంఖాన్‌ను అన్నా అని పిలిచి తాను తప్పు చేశానని జయప్రద అన్నారు. ఖాన్‌ పైకి కనిపించేంతటి మంచి మనిషి కాదనీ, లోపల ఇంకో మనిషి ఉన్నాడని ఆయనే స్వయంగా నిరూపించుకున్నాడన్నారు. ఆజంఖాన్‌ను అన్నా  అని పిలిచినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నానని జయప్రద అన్నారు. ఖాన్‌ వ్యాఖ్యలతో రాంపూర్‌ మహిళలంతా తన పక్షాన నిలవనున్నారనీ, ఇప్పుడు పోటీలో ఉన్నది జయప్రద కాదు, ప్రజలేనని ఆమె అభివర్ణించారు. రాంపూర్‌ లోక్‌సభ స్థానానికి జయప్రద 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు ఎస్పీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. తర్వాత అప్పటి పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా అమర్‌సింగ్‌తో కలిసి ఎస్పీ నుంచి బయటకు వచ్చారు. ఇటీవలే బీజేపీలో చేరి ప్రస్తుతం రాంపూర్‌లో కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఆజంఖాన్‌ వ్యాఖ్యల విషయంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు తనకు మద్దతు తెలపకపోవడంపై జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు