ఇవి ఎన్నికలు కాదు.. వేలం పాటలు

24 Feb, 2019 05:27 IST|Sakshi

జయప్రకాష్‌ నారాయణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోగానీ, దేశంలో గానీ ఇప్పుడు జరుగుతున్నవి ఎన్నికలు కాదని, అవి వేలం పాటల్లా సాగుతున్నాయని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలో జరిగిన లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోనూ, దేశంలో ప్రస్తుతం జరుగుతున్నది పరిపాలన కూడా కాదు, ఆ పేరుతో కలెక్షన్లు చేస్తున్నారని, ఎన్నికల్లో పెట్టిన ఖర్చుకు వసూళ్లు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

మొన్న ముగిసిన తెలంగాణ ఎన్నికల్లోనూ ఇదే చూశాం. ఏపీలోనూ చూడబోతున్నామని చెప్పారు. ఓట్లు కోసం రాజకీయ పార్టీలు పోటీపడి వరాలు ఇస్తున్నాయన్నారు. ఇలాంటి చిల్లర, మల్లర కార్యక్రమాల వల్ల ప్రజలకు నిజమైన ఫలితాలు అందకపోగా, వాటిలో నుంచే అవినీతి పుడుతుందన్నారు.  2019 ఎన్నికల్లో కేంద్రంలో ఎవరు అధికారం చేపట్టాలన్నా ప్రాంతీయ పార్టీలే కీలకమని, వచ్చే 25 ఏళ్ల పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీ పోటీ చేస్తుందా అన్న ప్రశ్నకు తమ పార్టీ పొలిట్‌ బ్యూరో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటుందని బదులిచ్చారు. లోక్‌సత్తా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన జయప్రకాష్‌ నారాయణ, ఈ ఎన్నికల సమయంలో దానిపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు.  

మరిన్ని వార్తలు