లోక్‌సభలో కేంద్రమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు

19 Jul, 2018 13:01 IST|Sakshi
కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా(పాత చిత్రం)

సాక్షి, న్యూఢిల్లీ : వర్షాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంట్‌ ఉభయ సభలు రెండో రోజు గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. నేడు రాజ్యసభలో ఆర్టీఐ అనుబంధ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు లోక్‌సభలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. చెన్నై విమానాశ్రయం విస్తరణ పనులపై అన్నాడీఎంకే సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా సమాధానం చెబుతున్న సమయంలో విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపించాయి. స్పీకర్‌ వారించిన కూడా  వారు వినిపించుకోలేదు. సిన్హా మాట్లాడుతున్న సమయంలో విపక్ష నాయకులు ఆయనకు వ్యతిరేకంగా, హేళన చేసేలా వ్యాఖ్యలు చేశారు.

జార్ఖండ్‌లో ఓ మాంస వ్యాపారిని కొట్టి చంపిన కేసులో జైలు నుంచి విడుదలైన నిందితులకు ఆయన పూలమాలలు వేసి, స్వీట్లు పంచి సన్మానం చేసిన సంగతి తెలిసిందే. హత్యకేసులో నిందితులకు సన్మానం చేసిన సిన్హా.. ఈ విషయమై సభకు సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్ష సభ్యులు ఆయన నిలదీశారు. సిన్హాకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

>
మరిన్ని వార్తలు