స్థానిక ఎన్నికల్లో పోటీ చేయం

5 Mar, 2020 05:34 IST|Sakshi

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి 

విశాఖలో చంద్రబాబును చావగొట్టనందుకు సంతోషం

తాడిపత్రి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోమని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీ చేస్తే అనర్హత వేటు వేస్తామని ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు హ్యాట్సాఫ్‌ అని చెప్పారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని అక్కన్నపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రమే తాము పోటీలో ఉంటామన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. అయితే గెలిచిన తర్వాత అభ్యర్థి మద్యం, డబ్బులు పంచారని అక్రమంగా కేసులు పెట్టి ఉన్న పదవి ఊడగొట్టి రెండేళ్లు జైలుకు పంపే కొత్త చట్టాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకొచ్చారన్నారు. అందుకు తాము సిద్ధంగా లేమన్నారు. ఇలాంటి కొత్త చట్టాల ద్వారా డబ్బులు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేమని, తమకు డబ్బులు మిగిల్చినందుకు సీఎంకు కృతజ్ఞతలన్నారు. విశాఖపట్నంలో చంద్రబాబును అడ్డుకోవడంపై స్పందిస్తూ తమ నాయకుడిని అక్కడ చావగొట్టనందుకు సంతోషిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు