నాలుక కోస్తా అన్నావ్‌.. ఎక్కడికి రావాలి: జేసీ

21 Sep, 2018 14:47 IST|Sakshi

సాక్షి, అనంతపురం : ‘నాలుక కోస్తా అన్నావ్’‌... ఎక్కడికి రావాలని పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి, కదిరి సీఐ గోరంట్ల మాధవ్‌పై  టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మండిపడ్డారు.  పోలీసులు కొజ్జాలు అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలపై సీఐ మాధవ్‌ ఘాటుగా బదులిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే తన నాలుక కోయాలని, తనపైనే మీసాలు తిప్పుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వు ఉద్యోగం వదిలి రా.. నేను రాజకీయాలు వదిలి వస్తా.. తేల్చుకుందాం’ అని సవాల్‌ విసిరారు. ఈ నెల 25 తర్వాత తాను బయటకు వెళ్తున్నట్లు.. ఈ లోపు ఎక్కడికి రావాలో చెప్పు తాడోపేడో తెల్చుకుందామన్నారు. (చదవండి: జేసీ దివాకర్‌రెడ్డికి పోలీసుల తీవ్ర హెచ్చరిక)

తాడిపత్రి ఘర్షణ సమయంలో పోలీసులు బాధ్యాతాయుతంగా వ్యవహరించలేదన్నారు. 200 మంది కర్రలతో దాడి చేస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు కొజ్జాల్లా పారిపోయారని, వారితో తను కూడా ఓ కొజ్జాలా పరుగెత్తినట్లు తెలిపారు. ఆడ, మగ కాని వారిని కొజ్జా అంటారని, ఈ పదం రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుతారని, ఎవరైన బాధపడి ఉంటే క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. తను ఏ ఒక్కరి పేరుతో ఆ పదాన్ని ఉచ్చరించలేదని, రక్షణ కల్పించాల్సిన పోలీసులు పరుగెత్తితే అలా అన్నానని చెప్పారు. ఈ విషయంలో తనది తప్పని నిరూపిస్తే పాదాభివందనం చేస్తానని, సీఐ మాధవ్‌ సినిమాల్లో హీరో సాయికుమార్‌లా మీసాలు తిప్పుతున్నాడని మండిపడ్డారు. ఈ సీఐ గతంలో తను చుట్టూ ఎన్నోసార్లు తిరిగాడన్నారు. అతనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు.

ప్రభోదానందస్వామి ఆశ్రమాన్ని తొలిగించాలని జేసీ డిమాండ్‌ చేశారు. విచారణ కమిటీకి ఇప్పటికే స్థానికులు అన్ని చెప్పారని, భక్తి భావంతో ప్రబోదానందస్వామి ఆశ్రమానికి ఒకసారి తను వెళ్లినట్లు స్పష్టం చేశారు. ఆయన డేరా బాబాతో సమానమని ఆరోపించారు.

చదవండి: పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారు!

మరిన్ని వార్తలు